Begin typing your search above and press return to search.

ప్చ్.. ఆ ఘనతలో తెలుగోడి వాటా పడిపోయింది

By:  Tupaki Desk   |   12 Oct 2015 3:52 AM GMT
ప్చ్.. ఆ ఘనతలో తెలుగోడి వాటా పడిపోయింది
X
దేశం మొత్తంమీద గత దశాబ్ది కాలంగా ఐఐటీలలో తెలుగు విద్యార్థుల హవా నడిచింది. ఐఐటీలలో అత్యధిక శాతం స్థానాలు సాధిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ అగ్రస్థానంలో ఉంటూ వచ్చాయి కాని బళ్లు ఓడలవుతున్న చందాన ఏయేటి కాయేడు ఐఐటీలలో తెలుగు విద్యార్థుల వాటా తగ్గుముఖం పడుతోంది. సంవత్సరం వ్యవధిలో ఐఐటీల్లో మన విద్యార్థుల వాటా 20శాతం నుంచి అమాంతంగా 9 శాతానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఉదాహరణకు 2014లో ఆంధ్ర - తెలంగాణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు దేశవ్యాప్తంగా ఐఐటీలలో 4,975 సీట్లు సాధించి అగ్రస్థానంలో నిలబడ్డారు. కానీ ఏ ఏడాది 1,546 మంది తెలుగు విద్యార్తులకు మాత్రమే ఐఐటీల్లో చోటు దక్కింది. దీనికి బలమైన కారణం ఏమంటే హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఐఐటీ కోచింగ్ కేంద్రాలు దేశవ్యాప్తంగా విస్తరించడంతో తెలుగువారి వాటా గణనీయంగా పడిపోతోందని వినికిడి.

గతంలో దేశం నలుమూలల నుంచి విద్యార్థులు వచ్చి హైదరాబాద్ లోని ఐఐటీ కోచింగ్ సంస్థల్లో శిక్షణ తీసుకునేవారు. గత కొన్నేళ్లుగా ప్రముఖ ఐఐటీ విద్యా సంస్థలు నారాయణ - చైతన్యలు కర్నాటక - కేరళ - రాజస్థాన్ రాష్ట్రాలలో ఐఐటీ కోచింగ్ సెంటర్లను నెలకొల్పాయి. దీంతో ఇతర రాష్ట్రాల్లోని విద్యార్థులు తమకు సమీపంగా ఉండే కోచింగ్ కేంద్రాల్లో చేరుతూ వచ్చారు.

రాజస్థాన్ ఈ సంవత్సరం ఎక్కువమంది విద్యార్థులను ఐఐటీలకు పంపించిన రాష్ట్రంగా రికార్డు సాధించింది. రాజస్థాన్ లోని కోటా నుంచి ఈ ఏడాది 1,965 మంది విద్యార్థులు ఐఐటీ అడ్మిషన్లు చేజిక్కించుకోగలిగారు. అదే తెలంగాణలో 770 మంది - ఆంధ్రప్రదేశ్‌ లో 776 మంది విద్యార్థులు మాత్రమే ఈ ఏడు ఐఐటీ సీట్లను సాధించగలిగారు. గత దశాబ్ది పొడవునా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఐఐటీల్లో 20 శాతం సీట్లను చేజిక్కించుకుంటూరాగా, ఈ సారి రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి వీరి సంఖ్య 9 శాతానికి పడిపోయింది.

తెలుగు రాష్ట్రాల ఐఐటీ కోచింగ్ కేంద్రాలనుంచి చేపలబండ మీద చేపలను తోమినట్లుగా విద్యార్థులను తోమే విధానాన్ని మిగతా రాష్ట్రాలు కూడా నేర్చుకున్నట్లుంది. అందుకే కాబోలు తెలుగు విద్యార్థుల వాటా తగ్గుముఖం పడుతోందని విమర్శకుల వ్యాఖ్య.