Begin typing your search above and press return to search.

భారత్ లో ఫోర్త్ వేవ్.. క్లారిటీ ఇచ్చిన ఐఐటీ ప్రొఫెసర్..!

By:  Tupaki Desk   |   23 Dec 2022 8:30 AM GMT
భారత్ లో ఫోర్త్ వేవ్.. క్లారిటీ ఇచ్చిన ఐఐటీ ప్రొఫెసర్..!
X
చైనాలోని వ్యూహన్ నగరంలో వెలుగు చూసిన కరోనా మహమ్మారి నాలుగేళ్లైనా ప్రపంచాన్ని ఇంకా వీడటం లేదు. గత మూడేళ్ల కాలంలో కరోనా పట్ల ప్రజల్లో ఎంతో అవగాహన వచ్చింది. కరోనాకు వ్యాక్సిన్ రాక ముందు వరకు ప్రజలంతా కరోనా జాగ్రత్తలు పాటించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం.. శానిటైజర్లు వాటడం.. భౌతిక దూరం పాటించడం లాంటి వంటివి చేశారు.

కరోనా సోకిన రోగులు స్వయంగా హోం ఐసోలేషన్లోకి వెళ్లిపోయేవారు. అలా కరోనాను ఒకరిని నుంచి మరొకరికి సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వాలు లాక్ డౌన్లు.. పాక్షిక లాక్డౌన్లతో కరోనాను కట్టడి చేసే ప్రయత్నం చేశాయి. ఇవన్నీ కూడా భారత్ లో సత్ఫలితాలనే ఇచ్చాయి. ఈ కాలంలో భారత వైద్యులు.. సిబ్బంది సేవలు ఎనలేనివి.

ఆ తర్వాత కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్ పంపించింది. ప్రజలు తొలుత ఈ వ్యాక్సిన్ వేయించుకునేందుకు భయపడిన తర్వాత అందరూ కరోనా టీకాలు వేయించారు. భారత్ లోని ప్రజలంతా దాదాపు మొదటి డోస్ వ్యాక్సిన్ పూర్తి చేసుకున్నారు. అలాగే సెకండ్ డోస్.. బూస్టర్ డోసులను సైతం ప్రజలు వేయించుకున్నారు.

ఈ క్రమంలోనే భారత్ లో క్రమంగా కేసుల సంఖ్య తగ్గిపోయి కరోనాకు ముందు పరిస్థితులు వచ్చాయి. అయితే మన పొరుగున ఉన్న చైనాలో మళ్లీ ఒమ్రికాన్ వేరియంట్.. బీఎఫ్ 7 వేరియంట్లు విజృంభిస్తుండటంతో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే చైనాలో వ్యాక్సినేషన్ ను ప్రభుత్వం విరివిగా చేయకపోవడమే ప్రస్తుత పరిస్థితి కారణమని తెలుస్తోంది.

అయితే భారత్ లో మాత్రం ఆ పరిస్థితి ఉండకపోవచ్చని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. భారత్ లో ఫోర్త్ వేవ్ తప్పదని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. భారత్ లోని 98 శాతం ప్రజలకు కోవిడ్ ను ఎదుర్కొనే సహజ రోగనిరోధక శక్తి వచ్చిందని తెలిపారు. ఈ కారణంగా కొత్త వేరియంట్లతో మనమంతా భయపడాల్సిన అవసరం లేదన్నారు.

ఈ ఏడాది అక్టోబర్ చివరి నాటికి చైనాలో కేవలం 5 శాతం జనాభాకు మాత్రమే సహజ రోగ నిరోధక శక్తి పెరిగిందని తెలిపారు. నవంబర్‌లో అది 20 శాతానికి పెరిగిందని తెలిపారు. నవంబర్లో జీరో కోవిడ్ విధానం ఎత్తివేయడం చైనాలో కోవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ వేగంగా పెరిగిందని ఆయన వివరించారు.

సహజ రోగనిరోధక శక్తిని పెంపొందించుకున్న ప్రపంచ దేశాలకు కోవిడ్ తో పెద్దగా సమస్య ఉండదని స్పష్టం చేశారు. దక్షిణ కొరియా 25 శాతం.. జపాన్‌లో 40 శాతం.. అమెరికాలో 20 శాతం మంది జనాభాకు సహజ రోగ నిరోధక శక్తి అభివృద్ధి ఇంకా చెందలేదని పేర్కొన్నారు. అయితే ముందస్తు జాగ్రత్తగా కోవిడ్ నిబంధనలు పాటించడం మంచిదని సూచించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.