Begin typing your search above and press return to search.

చెప్పుతో కొడతారట;తృప్తి దేశాయ్ కి ‘దర్గా’ సవాల్

By:  Tupaki Desk   |   23 April 2016 8:15 AM GMT
చెప్పుతో కొడతారట;తృప్తి దేశాయ్ కి ‘దర్గా’ సవాల్
X
ఎవరి నమ్మకాలు వారివి. ఎవరి విశ్వాశాలు వారివి. కానీ.. తాను నమ్మిందే జరగాలంటూ పట్టుదలతో వ్యవహరిస్తున్న తృప్తి దేశాయ్ తాజాగా మరో వివాదానికి తెర తీశారు. శని సింగనాపూర్ దేవాలయంలోకి మహిళల్ని అనుమతించాలని కోరుతూ కొన్ని నెలలుగా పోరాడుతున్న ఆమె కోర్టు దన్నుతో ఆలయంలోకి అడుగుపెట్టి పూజలు చేయటం తెలిసిందే. కొన్ని వందల ఏళ్లుగా సాగుతున్న సంప్రదాయాన్ని కాదని మరీ ఆమె అనుకున్నది సాధించారు.

భూమాతా బ్రిగేడ్ సంస్థను ఏర్పాటు చేసి.. కొన్ని దేవాలయాల్లోకి మహిళలకు అనుమతి నిరాకరించటంపై తృప్తి దేశాయ్ పోరాడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె దృష్టి ఒక దర్గా మీద పెట్టారు. ముంబయిలోని ప్రసిద్ధ హజీ అలీ దర్గాలోకి తాను ప్రవేశిస్తానని తాజాగా ప్రకటించిన ఆమె.. దర్గాలోకి తన ఎంట్రీని ఈ నెల 28గా డిసైడ్ చేశారు. ఆ రోజున తన దళంతో కలిసి దర్గాలోకి ప్రవేశించి పూజలు చేయనున్నట్లు వెల్లడించారు.

ఈ దర్గాలోకి మహిళలకు ఎంట్రీ లేదు. తృప్తి దేశాయ్ చేసిన తాజా వ్యాఖ్యపై శివసేన నాయకుడు హజీ అరాఫత్ షేక్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆమె కానీ దర్గాలోకి ప్రవేశించాలని చూస్తే చెప్పులతో కొడతామంటూ హెచ్చరిస్తున్నారు. తృప్తి దేశాయ్ ప్రకటన.. అందుకు హజీ అరాఫత్ ప్రతి ప్రకటన నేపథ్యంలో ఈ వ్యవహారం ఉద్రికత్త పరిస్థితుల్ని సృష్టించటం ఖాయమంటున్నారు. అయినా.. దేశంలోని ఇన్ని దర్గాలు.. ఆలయాలు ఉంటే ఏవో కొన్ని ప్రత్యేక పరిమితులున్న దేవాలయాలు.. ప్రార్థనాలయాల మీదనే తృప్తి దేశాయ్ అండ్ కో దృష్టి సారిస్తున్నారెందుకు..?