Begin typing your search above and press return to search.

ఆక్సీజ‌న్ సిలిండ‌ర్‌ లేక‌పోతే.. నెబ్యులైజ‌ర్ వాడొచ్చా?

By:  Tupaki Desk   |   2 May 2021 11:30 PM GMT
ఆక్సీజ‌న్ సిలిండ‌ర్‌ లేక‌పోతే.. నెబ్యులైజ‌ర్ వాడొచ్చా?
X
దేశంలో కొవిడ్ క‌ల్లోలం ఇప్ప‌ట్లో త‌గ్గుముఖం ప‌ట్టే సూచ‌న‌లు క‌నిపించ‌ట్లేదు. ఒక రోజు న‌మోదైన కేసుల సంఖ్య 4 ల‌క్ష‌లు దాటిపోయింది. దీంతో.. బాధితుల సంఖ్య ల‌క్ష‌లాదిగా పెరిగిపోతుంటే.. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే.. చాలా మంది ఆక్సీజ‌న్ అంద‌క‌నే ప్రాణాలు కోల్పోతున్నారు. ఆక్సీజ‌న్‌ కొనుగోలు స్థోమ‌త లేక కొంద‌రు.. కొనుగోలు కెపాసిటీ ఉన్న‌ప్ప‌టికీ.. అందుబాటులో లేక మ‌రికొంద‌రు చ‌నిపోతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఓ వార్త విస్తృతంగా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అదే నెబ్యులైజ‌ర్ వాడ‌కం.

చిన్న పిల్ల‌ల‌కు జ‌లుబు తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు నెబ్యులైజ‌ర్ ఉప‌యోగిస్తుంటారు. అందులో జ‌లుబు, ద‌గ్గుకు సంబంధించిన మందువేసి.. నెబ్యులైజ‌ర్ మెషీన్ ను ఆన్ చేస్తే.. ఆ మందు ఆవిరిగా మారిపోతుంది. దాన్ని ముక్కు ద్వారా పీలుస్తుంటారు.

ఆక్సీజ‌న్ అందుబాటులో లేనివారు ఈ నెబ్యులైజ‌ర్ ను ఉప‌యోగించ‌వ‌చ్చంటూ సోష‌ల్ మీడియాలో ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. ఆక్జీజ‌న్‌ కాన్స‌న్ట్రేట‌ర్ లేక‌పోయినా ప‌ర్వాలేద‌ని, నెబ్యులైజ‌ర్ తో మేనేజ్ చేయ‌వ‌చ్చని చెబుతున్నారు. అయితే.. ఇందులో వాస్త‌వం లేద‌ని పీఐబీ (ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో) స్ప‌ష్టం చేసింది.

అదంతా ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది. ఆక్సీజ‌న్ కోసం నెబ్యులైజ‌ర్ ను ఉప‌యోగించి, అన‌వ‌స‌రంగా ప్రాణాల మీద‌కు తెచ్చుకోవ‌ద్ద‌ని సూచించింది. ఆక్సీజ‌న్ సిలిండ‌ర్ల‌కు, ఆక్సీజ‌న్ కాన్స‌న్ ట్రేట‌ర్ల‌కు నెబ్యులైజ‌ర్ ప్ర‌త్యామ్నాయం కానే కాద‌ని స్ప‌ష్టం చేసింది.