Begin typing your search above and press return to search.

బెజవాడ వీధుల్లో నిరసన హోరెత్తుతుంటే.. తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో ఏం జరిగింది?

By:  Tupaki Desk   |   3 Feb 2022 10:40 AM GMT
బెజవాడ వీధుల్లో నిరసన హోరెత్తుతుంటే.. తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో ఏం జరిగింది?
X
ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కొద్ది రోజులుగా జగన్ ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీపై ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైనం తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది లేదు.నిరసన చేపడతామని ప్రభుత్వ ఉద్యోగులు కరాఖండిగా తేల్చి చెప్పిన వేళలోనూ.. దాని గురించి సీరియస్ గా ఆలోచించింది లేదు. నిరసన చేపడతామన్న తేదీ దగ్గర పడుతున్న వేళ.. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహరించిన ప్రభుత్వం అందుకు తగ్గ మూల్యాన్ని గురువారం చెల్లించుకోవాల్సి వచ్చిందని చెప్పాలి.

ఇప్పటివరకు జగన్ సర్కారుకు అనుకూలంగా ప్రజలు ఉన్నారనటానికి వీలుగా మధ్య మధ్యలో వచ్చే ఎన్నికల ఫలితాలు.. అందులో అధికార వైసీపీకి వచ్చే ఓట్లు.. సీట్లను చూపిస్తూ.. తమకు తిరుగులేదన్నట్లుగా వ్యవహరించటాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. అయితే.. ఎన్నికలు జరుగుతున్న తీరులోనే లోపం ఉందని.. అందుకే వైసీపీకి అనుకూలంగా పలితాలు వస్తున్నాయన్న విమర్శల్ని.. ఆరోపణలు ప్రజల్లో ఎలాంటి సంకేతాలు వెళుతాయన్న విషయాన్ని ప్రభుత్వ పెద్దలు పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి.

ఇవన్నీ కలగలిపి.. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు.. టీచర్లు ఏకమై విజయవాడకు నిరసన తెలిపేందుకు రావటం.. ఎవరూ ఊహించనంత భారీగా ఉండటంతో పాటు.. విజయవాడ మహానగరం ఇసుక వేస్తే రాలనట్లుగా వీధులు జనసందోహంతో నిండిపోవటం.. కనుచూపు వేర.. వీధుల్లో నిరసన చేసే ఉద్యోగులతో నిండిపోవటం.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు సిత్రమైన వాతావరణానికి తెర తీసేలా చేసిన పరిస్థితి.

టీవీల్లో వస్తున్న లైవ్ ను చూస్తున్న ఏపీ వాసులతో పాటు.. తెలంగాణ వాసులు సైతం విస్మయానికి గురయ్యే పరిస్థితి. ప్రభుత్వంపై తమ నిరసనను తెలియజేందుకు ప్రభుత్వ ఉద్యోగులు వ్యవహరించిన తీరు.. అందుకు వచ్చిన స్పందన ప్రభుత్వ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసిందన్న మాట వినిపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సరిగ్గా ప్రభుత్వ ఉద్యోగుల నిరసన హోరుతో బెజవాడ వీధులన్ని అట్టుడిగిపోతున్న వేళ.. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీషులో వాతావరణం ఎలా ఉంది? సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారన్న దానిపై ఆసక్తి నెలకొంది.

ఇదే విషయాన్ని తరచి చూస్తే.. అవాక్కు అయ్యే పరిస్థితి. ఎందుకంటే.. కొన్ని కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ ఉద్యోగులు నిరసన చేస్తుంటే.. అవేమీ తనకు పట్టనట్లుగా వ్యవహరించిన సీఎం జగన్.. తన క్యాంప్ ఆఫీసులో రాష్ట్రంలో అమలు చేయాలని భావిస్తున్న నూతన విద్యా విధానం అమలుకు సంబంధించిన రివ్యూ సమావేశాన్ని పెట్టుకున్నారు.కొత్తగా వర్గీకరించిన ఆరు రకాల స్కూళ్లు.. అందులో ఉండాల్సిన సిబ్బంది తదితర అంశాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వివరాల్ని అందజేశారు. వాటిపై సీరియస్ గా రివ్యూ జరుగుతున్న తీరు చూస్తే.. అధికారం చేతికి రావటానికి కారణమైన వారు వీధుల్లో నిరసన చేపడుతుంటే.. తాపీగా సాగుతున్న రివ్యూ సరైన సంకేతాల్ని ఇవ్వటం లేదన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది.