Begin typing your search above and press return to search.

పాన్,ఆధార్ కార్డ్ వాళ్ల‌కు ఇవ్వ‌క‌ పోతే...అంత భారీ న‌ష్టం

By:  Tupaki Desk   |   25 Jan 2020 4:02 AM GMT
పాన్,ఆధార్ కార్డ్ వాళ్ల‌కు ఇవ్వ‌క‌ పోతే...అంత భారీ న‌ష్టం
X
ఉద్యోగుల‌కు ఓ షాక్ వార్త‌. ఆదాయపు పన్ను శాఖ వీరికి వ‌ర్తించేలా కీల‌క ఆదేశాలు జారీ చేసింది. పాన్‌కార్డు లేదంటే.. ఆధార్‌ కార్డు ఇవ్వని ఉద్యోగులకు 20 శాతం వరకు లేదా అత్యధిక రేటుతో పన్ను మొత్తాన్ని జీతాలు ఇచ్చే సమయంలో టాక్స్ డెడెక్టెడ్ ఎట్ సోర్స్ (TDS) చేయాలని ఆదాయపు పన్ను శాఖ స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు అన్ని సంస్థల యాజమాన్యాలకు మరోసారి తెలిపింది. యాజమాన్యాలు ఈ టీడీఎస్‌ నియమాలను పాటించక పోతే వారికి జరిమానాలు విధిస్తామని వెల్లడించింది.

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఉద్యోగులు తమ పాన్‌ కార్డు వివరాలను యాజమాన్యాలకు అందజేయాలి. అయితే, ప‌లువురు ఉద్యోగులు దీన్ని పాటించ‌డం లేదు. కొన్ని సంస్థ‌లు సైతం చూసి చూడ‌న‌ట్లు ఉంటున్నాయి. ఈ నేప‌థ్యం లో...మ‌రోమారు నిబంధ‌న‌లు పేర్కొంటూ ఉద్యోగులు త‌మ వివ‌రాలు ఇవ్వక పోతే 20 శాతం మొత్తం కానీ, చట్టంలో వర్తించే రేటు ప్రకారం గానీ ఏది ఎక్కువ అయితే అంత మొత్తాన్ని పన్ను రూపంలో వారి దగ్గర నుంచి కట్ చేయాల‌ని ఆదాయ‌పు ప‌న్ను శాఖ తెలిపింది. యజమానులు తమ టిడిఎస్ బాధ్యతలలో ఖచ్చితంగా ఉండాలని, ఏవైనా తప్పులు దొర్లితే జరిమానా కట్టాల్సి వస్తుందని సర్క్యులర్ తెలిపింది.

సాధారణంగా 20 శాతం శ్లాబు కంటే తక్కువలోకి వచ్చే ఉద్యోగులు పాన్‌, లేదా ఆధార్‌ నంబర్‌ ఇవ్వకపోతే వారికి జీతంలో 20 శాతం పన్ను కోత విధిస్తారు. అదే 20 శాతం శ్లాబు దాటితే ఎంత అయితే అంత కోత విధించడంతో పాటు 4 శాతం హెల్త్‌, ఎడ్యూకేషన్‌ సెస్‌ కూడా వసూలు చేస్తారు. సంస్థలు లెక్కలు సిద్ధం చేస్తున్న త‌రుణంలో మ‌రోమారు వాటిని హెచ్చ‌రించేందుకు ఈ క్రమంలో ప్రకటన చేసింది.