Begin typing your search above and press return to search.

భర్త చనిపోయి మళ్లీ పెళ్లి చేసుకుంటే ఆస్తి దక్కదు.. ఏ కోర్టు చెప్పిందంటే?

By:  Tupaki Desk   |   6 July 2021 4:30 AM GMT
భర్త చనిపోయి మళ్లీ పెళ్లి చేసుకుంటే ఆస్తి  దక్కదు.. ఏ కోర్టు చెప్పిందంటే?
X
భర్త మరణించిన తర్వాత ఆ మహిళ మరో వ్యక్తిని పెళ్లాడితే? మొదటి భర్త నుంచి వచ్చిన ఆస్తి.. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత దక్కుతుందా? లేదా? ఈ ప్రశ్నలకు తాజాగా కోర్టు తీర్పు సమాధానం చెప్పేసింది. భర్తను కోల్పోయిన మహిళ.. రెండో పెళ్లి చేసుకుంటే.. మొదటి భర్త ద్వారా సంక్రమించిన ఆస్తి సదరు మహిళకు చెందదని కోర్టు స్పష్టం చేసింది. అయితే.. సదరు మహిళ మరో పెళ్లి చేసుకున్న విషయాన్ని చట్టప్రకారం నిరూపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఈ ఆసక్తికర తీర్పును ఛత్తీస్ గఢ్ హైకోర్టు వెల్లడించింది. వరుసకు తన అన్న అయిన ఘాసీ మరణించారని.. అతని భార్య కియబాయి.. స్థానిక సంప్రదాయం ప్రకారం రెండో పెళ్లి చేసుకుందని పేర్కొన్నాడు. అందుకే.. తన అన్న ఆస్తిని ఆమెకు చెందకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. సంప్రదాయం ప్రకారం ఆమె పెళ్లి చేసుకున్నందున.. మొదటి భర్తకు చెందిన ఆస్తి ఆమెకు ఎలా చెందుతుందని ప్రశ్నించాడు. లోక్ నాథ్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలుచేశారు.

ఈ అంశంపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఇరు వర్గాల వాదనల్ని విన్నది. హిందూ విడో రీ మ్యారేజ్ యాక్ట్ 1856లోని సెక్షన్ ఆరు ప్రకారం మళ్లీ పెళ్లి చేసుకున్న మహిళకు సంబంధించిన అన్ని ప్రక్రియలు నిరూపితం కావాలని.. అలా చట్టప్రకారం మళ్లీ పెళ్లి చేసుకున్నట్లుగా తేలితే.. మొదటి భర్త నుంచి వచ్చే ఆస్తిపై ఆమెకు హక్కు ఉండదని కోర్టు స్పష్టం చేసింది. అయితే.. తాజా కేసులో మాత్రం.. స్థానిక సంప్రదాయం ప్రకారం చేతి గాజుల్ని ఇవ్వటం ద్వారా ఒక మహిళనుపెళ్లి చేసుకోవటం కూడా రెండో పెళ్లిగా పేర్కొన్న వాదనను కోర్టు కొట్టేసింది. కియాబాయి మళ్లీ పెళ్లి చేసుకున్నట్లు చట్టబద్దంగా నిరూపితం కాలేదని స్పష్టం చేసింది. లోక్ నాథ్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేస్తూ నిర్ణయం తీసుకుంది.