Begin typing your search above and press return to search.

భూమిలో గుప్తనిధులు దొరికితే ఎవరికి సొంతమవుతుంది?

By:  Tupaki Desk   |   11 April 2021 12:18 PM IST
భూమిలో గుప్తనిధులు దొరికితే ఎవరికి సొంతమవుతుంది?
X
గుప్త నిధుల గురించిన చర్చ తరచూ ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉంటుంది. వీటి కోసం ఎవరికి వారుగా చేసే ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. ఇదిలా ఉంటే.. ఎలాంటి ప్రయత్నం లేకుండా.. ఉత్త పుణ్యానికే కొన్నిసార్లు దొరికేస్తుంటాయి. తాజాగా అలాంటి ఉదంతమే జనగామ జిల్లా పెంబర్తిలో చోటు చేసుకుంది. వ్యవసాయభూమిలో దొరికిన అంకె బిందెలో బంగారం.. వెండి.. పగడాలు. రాగిపాత్ర దొరికాయి. ఇదో సంచలనంగా మారింది.

లంకె బిందె దొరికినంతనే భూయజమానులు అధికారులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి వాటిని తీసుకెళ్లారు. ఇంతవరకు ఓకే. మరి.. గుప్త నిధి ఎవరికి సొంతం? ఎవరు దాని యజమానులు? చట్టం ఏం చెబుతోందన్నది చూస్తే ఆసక్తికర అంశాలు తెలుస్తాయి. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చట్టంలోని నిబంధనల ప్రకారం భూమి లోపల దొరికిన ఎలాంటి నిధి పైనా ఎవరికి హక్కులు ఉండవు. అది వారసత్వ సంపద కింద ప్రభుత్వానికే చెందుతుంది. భూమిలో పాతి పెట్టిన నిధి జాతి వారసత్వ సంపద. ఆ సొమ్ముపై ఎవరికి ఎలాంటి హక్కులు ఉండవు. ప్రభుత్వమే పూర్తిగా స్వాధీనం చేసుకుంటుంది.

ఈ చట్టం వెనుక అసలు విషయం ఏమంటే.. బ్రిటిషర్లు దేశాన్ని పాలించే రోజుల్లో రాజులు.. సంపన్నులు ఆలయాలు.. భూముల్లో తాము సంపదను దాచి పెట్టేవారు. అలాంటి వాటి మీద కన్నేసిన బ్రిటిషర్లు.. 1878లో అలాంటి వాటిని సొంతం చేసుకోవటం కోసం ఇండియన్ ట్రెజర్ ట్రోవ్యాక్ట్ పేరుతో ఒక చట్టాన్ని రూపొందించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం ఆ చట్టానికి కొన్ని మార్పులు చేసింది.

ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం రాచరిక కలానికి చెందినది అయితే రాతి ముక్కల నుంచి రతనాల దాకా ఏం దొరికినా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సొంతం చేసుకుంటుంది. ఒకవేళ.. భూ యజమానుల పూర్వీకులదైతే.. దాని వారసులు ఎవరన్నది విచారించి.. సంపదను వాటాలుగా విభజిస్తారు.

దొరికిన సంపదలో 1/5 వంతు భూ యజమానికి.. ఆ భూమిని యజమాని కాకుండా ఎవరైనా కౌలుదారు చేస్తుంటే.. వారికి.. నిధిని వెలికి తీసిన కూలీలకు 1/5 వంతులో కొంతవాటాను ఇస్తారు. ఒకవేళ.. గుప్త నిధి లభించినా దాని గురించి అధికారులకు సమాచారం ఇవ్వకుండా సదరు వ్యక్తులకుజైలుశిక్ష.. జరిమానా.. కొన్ని సందర్భాల్లో రెండింటిని విధిస్తారు.