Begin typing your search above and press return to search.

ఆక్సీజ‌న్ ఇవ్వ‌కుంటే.. శిక్ష‌కు సిద్ధ‌ప‌డాలిః హైకోర్టు హెచ్చ‌రిక‌

By:  Tupaki Desk   |   2 May 2021 2:30 PM GMT
ఆక్సీజ‌న్ ఇవ్వ‌కుంటే.. శిక్ష‌కు సిద్ధ‌ప‌డాలిః హైకోర్టు హెచ్చ‌రిక‌
X
ఢిల్లీకి 490 మెట్రిక‌ల్ ట‌న్నుల ఆక్సీజ‌న్ కేటాయిస్తామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్ర‌కారం ఆక్సీజ‌న్ కేటాయిస్తే స‌రే.. లేదంటే కోర్టు ధిక్క‌ర‌ణ‌ను ఎదుర్కోవ‌డానికి సిద్ధంగా ఉండాల‌ని ఢిల్లీ హైకోర్టు హెచ్చ‌రించింది. ఆక్సీజ‌న్ అంద‌క ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రాష్ట్రంలో పెరుగుతూనే ఉంది. అయిన‌ప్ప‌టికీ.. కేంద్రం ప‌ట్టించుకోవ‌ట్ల‌ద‌ని న్యాయ‌స్థానం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేసింది.

ఆక్సీజ‌న్ అంద‌క ఢిల్లీలోని బాత్రా ఆసుప‌త్రిలో ఓ డాక్ట‌రు స‌హా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విష‌యాన్ని కోర్టు తీవ్రంగా ప‌రిగ‌ణించింది. వైద్యుల‌కే ఆక్సీజ‌న్ అంద‌క ప్రాణాలు కోల్పోతుంటే.. మిగిలిన వారి ప‌రిస్థితి ఏంట‌ని ఆవేద‌న వ్య‌క్తంచేసింది. ఢిల్లీలో ఇంత‌టి దారుణ ప‌రిస్థితులు ఉన్న‌ప్ప‌టికీ.. కేంద్రం ఎందుకు ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని నిల‌దీసింది.

శ‌నివారం జ‌రిగిన విచార‌ణ‌లో కోర్టు ఈ మేర‌కు వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్క‌ర‌ణ‌ను ఎదుర్కోవాల‌న్న ఆదేశాల‌ను సోమ‌వారం వ‌ర‌కు వాయిదా వేయాల‌న్న కేంద్రం త‌ర‌పు లాయ‌ర్ అభ్య‌ర్థ‌న‌ను ధ‌ర్మాస‌నం తిర‌స్క‌రించింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎంతో జాప్యం జ‌రిగింద‌ని చెప్పింది. క‌నీసం అర‌గంట వ‌ర‌కైనా వాయిదా వేయాల‌న్న విన్న‌పాన్ని సైతం తోసిపుచ్చింది.

ఈ రోజు (శ‌నివారం) ఆక్సీజ‌న్ స‌ర‌ఫ‌రా చేయ‌క‌పోతే.. మీరు ఇచ్చే సంజాయిషీని సోమ‌వారం వింటామ‌ని కోర్టు తెలిపింది. ప్ర‌జ‌లు మ‌ర‌ణిస్తుంటే మేము క‌ళ్లు మూసుకుని ఉండాలా? అని ఘాటుగా ప్ర‌శ్నించింది న్యాయ‌స్థానం.

ఢిల్లీలో ఆక్సీజ‌న్ అంద‌క ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఢిల్లీలో ఆక్సీజ‌న్ ప్లాంట్లు లేవ‌ని, దీంతో.. తాము ఏమీ చేయ‌లేక‌పోతున్నామ‌ని ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ ఆవేద‌న వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఆక్సీజ‌న్ కోసం తాము ఎవ‌రిని సంప్ర‌దించాలో చెప్పాల‌ని నేరుగా ప్ర‌ధానిని వీడియో కాన్ఫ‌రెన్స్ లో కేజ్రీవాల్ అడిగారు. ఈ నేప‌థ్యంలో హైకోర్టు పై వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.