Begin typing your search above and press return to search.

ఏపీకి బాబు స్థానంలో కేసీఆర్ ఉండి ఉంటే?

By:  Tupaki Desk   |   8 March 2018 10:23 AM IST
ఏపీకి బాబు స్థానంలో కేసీఆర్ ఉండి ఉంటే?
X
ఏపీకి ఏమీ ఇవ్వ‌మ‌ని తేల్చేసింది. కాదూ కూడ‌దంటే తమ‌కు తోచిన ముష్టి వేస్తామ‌ని స్ప‌ష్టం చేసింది మోడీ స‌ర్కారు. విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీకి హోదా ఇస్తామ‌ని నాటి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ పార్ల‌మెంటులో చేసిన ప్ర‌క‌ట‌న‌ను న‌వ్వులపాలు చేస్తూ.. తాము అనుకున్న‌దే న్యాయ‌మ‌న్న‌ట్లుగా మోడీ అండ్ కో తేల్చేసింది.

ఇదంతా ఒక ఎత్తు. ఏపీని ఇంత అవ‌మానించిన దానికి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఏం చేశారన్న ప్ర‌శ్న వేసుకుంటే.. అంద‌రూ ఊహించిన‌ట్లే కేంద్రంలో మంత్రులుగా ఉన్న వారిని ఆ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయించారు. అక్క‌డితో తన ప‌ని అయిపోయింద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు చంద్ర‌బాబు. ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త బాబుకు అర్థ‌మైంది కాబ‌ట్టే ఆయ‌నీ నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. నిజానికి జైట్లీ కొత్త‌గా చెప్పిందేమీ లేదు.

గ‌తంలో ఇదే తీరులో ఆయ‌న ప‌లుమార్లు చెప్పారు. అయినా అర్థం కాన‌ట్లుగా అదే ప‌నిగా హోదా గురించి లొల్లి చేస్తార‌న్న‌ట్లుగా ఈసారి కాస్త క‌టువుగా మాట్లాడారంతే. హోదా ఇవ్వ‌మ‌ని మేం చెబుతున్నా.. మీకు అర్థం కాదా?.. విభ‌జ‌న కార‌ణంగా ఏపీకి జ‌రిగిన న‌ష్టం గురించి బాధ ప‌డ‌మంటే బాధ ప‌డ‌తాం. కావాలంటే క‌న్నీళ్లు కూడా కారుస్తాం.. ఎందుకంటే.. మీ మీద మాకు సానుభూతి ఉంది. కానీ.. మా బొక్క‌సంలో ఉన్న నిధులు మాత్రం ఏపీకి ఇచ్చేది లేదనేశారు. మాకు న‌చ్చితే క‌ర్ణాట‌క‌కు అప్ప‌నంగా రూ.20వేల కోట్లు మెట్రో ప్రాజెక్టుకి.. ఇత‌ర‌త్రా ప‌నుల కోసం ఇచ్చేస్తాం కానీ.. విభ‌జ‌న కార‌ణంగా అప్పుల‌పాలైన ఏపీకి ఇప్ప‌టికి ఇచ్చిందే ఎక్కువ‌న్న‌ట్లుగా జైట్లీ మాట‌లున్నాయి. ఇంత‌కాలం దేశంలో ఏపీ భాగం కాదా? అన్న సందేహాన్ని వ్య‌క్తం చేసిన కొంద‌రు బుద్ధ‌జీవుల‌కు క‌లిగిన భావ‌న‌.. నేడు ఏపీలోని ఆంధ్రోళ్ల‌కు క‌లిగే ప‌రిస్థితి. ఇదంతా ఎందువ‌ల్ల‌? ఎవ‌రి అస‌మ‌ర్థ‌త కేంద్రం ఇలాంటి నిర్ణ‌యం తీసుకునేలా చేసిందంటే అది బాబు పుణ్య‌మేన‌ని చెప్పాలి.

ఎందుకండి.. ప్ర‌తి విష‌యానికి బాబు మీద ప‌డిపోతారు? అంటూ కొంద‌రికి బాధ క‌ల‌గొచ్చు. కానీ.. ఇప్పుడు చెప్పేది జాగ్ర‌త్త‌గా వింటే విష‌యం అర్థ‌మ‌వుతుంది. ఒక‌వేళ బాబు ప్లేస్ లో కేసీఆర్ ఉన్నార‌నుకుందాం? ఇలాంటి సీన్ అస‌లు వ‌చ్చేదా? ఎప్పుడైతే కేంద్రం హ్యాండ్ ఇవ్వాల‌న్న ఆలోచ‌న‌లోకి వ‌చ్చిన వెంట‌నే ఆ విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి వెళ్లేలా చేయ‌టం.. కేంద్ర ద‌ర్మార్గ వైఖ‌రిపై సామాన్య ప్ర‌జానీకానికి చైత‌న్యం క‌లిగేలా చేయ‌టం.. న‌ష్టతీవ్ర‌త ఎంత‌న్న‌ది అవ‌గాహ‌న క‌లిగేలా చేయ‌టం.. కేంద్రంపై ర‌గిలిపోయేలా చేయ‌టం చేసేవార‌న‌టంలో సందేహం లేదు.

ఇదంతా ఎందుకంటే.. త‌న‌ను చూసి భ‌య‌ప‌డినా.. భ‌య‌ప‌డ‌కున్నా.. ప్ర‌జ‌ల్లో పెరిగే చైత‌న్యం.. వారిలో అంత‌కంత‌కూ పెరిగే ఆగ్ర‌హం ఎలాంటి ప్ర‌భుత్వాల‌కైనా వ‌ణుకు పుట్టేది. ఎక్క‌డిదాకానో ఎందుకు? హోదా విష‌యాన్ని తేల్చేయ‌ట‌మే కాదు.. హోదా ఇవ్వ‌క‌పోవ‌టానికి కేవ‌లం త‌మ‌కున్న ఇగోనే అన్న‌ట్లుగా జైట్లీ చెప్పేసిన త‌ర్వాత ఏపీ నాయ‌క‌త్వం బాబు చేతిలో కాకుండా కేసీఆర్ చేతిలో ఉండి ఉంటే.. ఈ రోజు ఏపీ బంద్ జ‌రిగేది. యావ‌త్ ఏపీ అట్టుడిగిపోయేది. ఏపీకి జ‌రిగిన అన్యాయంపై జాతీయ స్థాయిలో అంతోఇంతో స్పంద‌న ఉండేది.

కానీ.. బాబు కార‌ణంగా ఈ రోజు అలాంటి ప‌రిస్థితి లేదు. ఎందుకిలా అంటే హోదా విష‌యంలో మైలేజీ మొత్తం త‌న‌కే చెందాల‌న్న అత్యాశే.. ఇవాల్టి ప‌రిస్థితికి కార‌ణంగా చెప్పాలి. నిజానికి ఎన్నిక‌లు మ‌రో ఏడాదికి త‌గ్గిపోవ‌టంతో ఇవాల్టి సీన్ ఆవిష్కృత‌మైంది కానీ.. మ‌రో మూడేళ్లు ఉండి ఉంటే ఎలా ఉండేదో అంద‌రికి తెలిసిందే.

రాజ‌కీయ మైలేజీ మొత్తం త‌న ఖాతాలోనే ప‌డాల‌ని కేసీఆర్ అనుకుంటారు కానీ.. దాంతో పాటు ప్ర‌జ‌ల్ని.. పార్టీల‌న్ని స‌మీక‌రించి త‌న దారిలో న‌డిచేలా చేస్తారు. తాను అంద‌రికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాన‌ని.. త‌న మాట‌ను తేలిగ్గా తీసుకుంటే న‌ష్ట‌పోతార‌న్న విష‌యాన్ని త‌న చేత‌ల‌తో స్ప‌ష్టం చేస్తారు. ఇలాంటి తీరు కేంద్రంలోని వారిని అప్ర‌మ‌త్తం చేయ‌ట‌మే కాదు.. ఆలోచించి నిర్ణ‌యం తీసుకునేలా చేస్తుంది. కానీ.. బాబు విష‌యంలో అలా ఉండ‌దు. ఆయ‌న త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నం దృష్ట్యా నిర్ణ‌యం తీసుకున్నారే కానీ.. హోదా ఇవ్వ‌లేద‌ని కాదు.

ఎందుకంటే.. ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌మ‌ని ఇవాళ కొత్త‌గా ఏమీ జైట్లీ చెప్ప‌లేదు. గ‌తంలో ప‌లుమార్లు ఇదే విష‌యాన్ని చెప్పినా.. విన‌కుండా అదే ప‌నిగా అడుగుతారేంటి? ఈ గోలేంది? అన్న చికాకును మాత్ర‌మే ప్ర‌ద‌ర్శించార‌ని చెప్ప‌కత‌ప్ప‌దు.