Begin typing your search above and press return to search.

పెళ్లాం టీ పెట్టనంటే.. రెచ్చగొట్టినట్లు కాదు బాస్

By:  Tupaki Desk   |   25 Feb 2021 7:14 PM IST
పెళ్లాం టీ పెట్టనంటే.. రెచ్చగొట్టినట్లు కాదు బాస్
X
భార్య కట్టు బానిస కాదు. భర్త నోటి నుంచి మాట వచ్చినంతనే సేవలు చేయాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని బుర్రలో కాస్త గుజ్జు ఉన్న వారికి అర్థమవుతూనే ఉంటుంది. కానీ.. నరనరాన నిండిన పురుషాధిక్యత (అందరికి కాదులెండి కొందరికి మాత్రమే సుమా) పురుష పుంగవులు ఇళ్లల్లో చెలరేగిపోతుంటారు. తమ నోటి నుంచి మాట వచ్చినంతనే పని చేయని భార్యను అనరాని మాటలు అనటమే కాదు.. చెయి చేసుకునే వారికి లోటు ఉండదు. అలాంటి వ్యక్తి ఒకరు.. భార్యను టీ చేయమంటే చేయనని చెప్పినందుకు రెచ్చిపోయి ఆమె మీద దాడికి పాల్పడ్డాడు.

దీంతో.. ఆమె భర్తపై ఫిర్యాదు చేసింది. దీనిపై సదరు వ్యక్తి వాదనలకు దిగుతూ.. టీ తయారు చేయమంటే.. నో చెప్పటం ద్వారా తనను రెచ్చగొట్టిందని పేర్కొన్నారు. దీనిపై తాజాగా బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్తకు టీ తయారు చేయటానికి నిరాకరించే భార్య మాట రెచ్చగొట్టేది కాదని స్పష్టం చేయటమే కాదు.. సదరు భర్తకు కింది కోర్టు విదించిన శిక్షను ఖరారు చేసింది.

ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ రేవతి మోహితే దేరే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భార్య అంటే చరాస్తి కాదు. వస్తువు అంతకన్నా కాదు. పెళ్లి అనేది సమానత్వం మీద ఆధారపడిన స్నేహం. వాస్తవంగా మాత్రం అలా ఉండటం లేదన్నారు. ఇలాంటి కేసులు సహజమైనవి కావని.. వక్రీకృత పితృస్వామ్య వ్యవస్థను సూచిస్తుందన్నారు. భార్యను భర్త తన చరాస్తిగా భావించటానికి దారి తీస్తుందన్నారు.

లింగ వివక్షత కారణంగా భార్య ఇంటి పనికే పరిమితమైందని.. ఆ పనుల్ని ఆమెకు కేటాయించినవే అన్న భావం పాతుకుపోయిందన్నారు. వివాహంలో భార్య నుంచి భావోద్వేగ శ్రమను కూడా ఆశిస్తున్నట్లుగా వ్యాఖ్యానించారు. ఇంతకూఈ కేసు వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాకు చెందిన సంతోష్ అనే వ్యక్తి భార్యతో తరచూ గొడవ పడుతూ ఉండేవాడు. 2013 డిసెంబరులో భార్యను టీ పెట్టాలని అడిగితే ఆమె పట్టించుకోకుండా బయటకు వెళ్లిపోయింది.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త.. సుత్తితో ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ గొడవకు ఇంట్లో నిద్రపోతున్న ఆరేళ్ల కుమార్తె బయటకు వచ్చి చూడగా.. తండ్రి దారుణంగా కొట్టిన దెబ్బ కంటపడింది. అనంతరం ఇంటిని శుభ్రం చేసిన భర్త భార్యనుఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆమె కోలుకోవటానికి వారం పట్టింది. అనంతరం ఆమె భర్తపై ఫిర్యాదు చేసింది. టీ పెట్టమంటే పెట్టకుండా తనను రెచ్చగొట్టిందని.. అందుకు కొట్టినట్లుగా చెప్పాడు. దీనిపై మండిపడిన కోర్టు కుమార్తె సాక్ష్యాన్ని తీసుకొని పదేళ్లు జైలుశిక్ష విధించారు. కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు సైతం ఇదే తీర్పును సమర్థించింది.