Begin typing your search above and press return to search.

బీజేపీ క‌క్కుర్తి... 7 వేల మందికి బీఫారం ఇస్తే.. స‌రిపోదు!

By:  Tupaki Desk   |   3 April 2021 4:31 PM GMT
బీజేపీ క‌క్కుర్తి... 7 వేల మందికి బీఫారం ఇస్తే.. స‌రిపోదు!
X
ఇల్లు కాలి ఒక‌డు ఏడుస్తుంటే.. చుట్ట‌కు నిప్పు దొరికింద‌ని మ‌రొక‌డు ఆనందించిన‌ట్టుగా ఉంది.. బీజేపీ ప‌రిస్థితి. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అధికార పార్టీ దూకుడు, అక్ర‌మాలు, అన్యాయాలు జ‌రుగుతున్నాయ‌ని, పోలీసులు అధికార పార్టీతో మిలాఖ‌త్ అయిపోయి.. ఏక‌గ్రీవాలు చేసుకున్నార‌ని.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఆరోపిస్తోంది. మ‌రీముఖ్యంగా గ‌త ఏడాది ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ స్థానాల్లో భారీ ఎత్తున ఏక‌గ్రీవాలు అయ్యాయని, ఇవ‌న్నీ కూడా బ‌ల‌వంత‌మేన‌ని. కొంద‌రిని బెదిరించి మ‌రీ నామినేష‌న్లు ఉప‌సంహ‌రించేలా చేశార‌ని.. సో.. ఇప్పుడు అవ‌న్నీ ర‌ద్దు చేసి.. కొత్త‌గా ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వాల‌ని టీడీపీ నేత‌లు డిమాండ్ చేస్తున్నారు.

అయితే.. దీనికి రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం స‌సేమిరా అన‌డంతోపాటు.. ఒంటెత్తు పోక‌డ‌లు పోతోంది. అఖిల‌ప‌క్షం స‌మావేశానికి అన్ని పార్టీల‌ను పిలిచి.. దానికి ముందు రోజే నోటిఫికేష‌న్ ఇచ్చేసింది. దీంతో ఎన్నిక‌ల సంఘం వైఖ‌రికి నిర‌స‌న‌గా.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఏకంగా ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను తాము బ‌హిష్క‌రిస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. నిజానికి ఈ నిర్ణ‌యంలో ఓ ఆవేద‌న‌, ఆక్రోశం క‌లిసి ఉన్నాయి. రాష్ట్రంలో రాజ‌కీయ ప‌క్షాలు కూడా చంద్ర‌బాబును సైద్ధాంతికంగా వ్య‌తిరేకించినా.. ఇలాంటి విష‌యాల్లో క‌లిసి వ‌చ్చి.. ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రిని ఎండ‌గ‌ట్టి.. ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను ఆది నుంచి జ‌రిగేలా ప్ర‌య‌త్నించాలి. అంద‌రూ క‌లిసి క‌ట్టుగా వ్య‌వ‌హ‌రించాలి.

కానీ, ఘ‌న‌త వ‌హించిన బీజేపీ నాయ‌కులు మాత్రం క‌క్కుర్తి రాజ‌కీయాల‌కు తెర‌దీశారు. టీడీపీ బ‌హిష్క‌ర‌ణ పిలుపు ఎత్తుకోగానే.. వెంట‌నే ఆ పార్టీకి చెందిన 7 వేల మంది నేత‌ల‌ను.. త‌మ‌వైపు తిప్పేసుకునేందుకు వ్యూహానికి రెడీ అయిపోతున్నారు. వాస్త‌వానికి చంద్ర‌బాబు బ‌హిష్క‌ర‌ణ పిలుపు ఇచ్చినా.. ఇప్ప‌టికే బ‌రిలో నిలిచిన 7 వేల మంది నాయ‌కులు మాత్రం పోటీకే సై అంటున్నారు. దీనికి కార‌ణాలు అనేకం ఉన్నాయి. స్థానికంగా ఓటు బ్యాంకును కాపాడుకోవ‌డం.. వారికి ప‌రువుతో కూడిన వ్య‌వ‌హారం కావ‌డం వంటి నేప‌థ్యంలో అవ‌స‌ర‌మైతే.. ఇండిపెండెంట్‌గా అయినా.. పోటీకి సిద్ధ‌ప‌డాల‌ని నిర్ణ‌యించారు. అయితే.. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే బీజేపీ త‌న మెద‌డుకు ప‌దును పెంచింది.

వెంట‌నే కొంద‌రుసీనియ‌ర్లు భేటీ అయి.. ఈ ఏడు వేల మంది తామే బీఫారాలు ఇచ్చేస్తే.. ఎలా ఉంటుంద‌నే విష‌యంపై చ‌ర్చ‌లు మొద‌లు పెట్టేశార‌ట‌! ప్ర‌స్తుతం బీజేపీ ప‌రిస్థితి ఏపీలో ఎలా ఉందంటే.. నోటా కంటే త‌క్కువ ఉంది. ఈ నేప‌థ్యంలో ఇది(చంద్ర‌బాబు బ‌హిష్క‌ర‌ణ నిర్ణ‌యం) మంచి స‌మ‌యం/ అవ‌కాశం అని.. టీడీపీ వాళ్ల‌ను లాగేసి ప‌బ్బం గ‌డుపుకొంటే ఎలా ఉంటుంద‌ని ఆలోచిస్తున్నార‌ట‌. అంతేకాదు.. ఇదే విష‌యంపై బీజేపీ పెద్ద‌ల‌తోనూ డిస్క‌స్ చేస్తున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో ఆ 7 వేల మందిని పొలిటిక‌ల్‌గా మోటివేట్ చేసే ప‌నికూడా ప్రారంబించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. కేంద్రంలో త‌మ‌దే ప్ర‌భుత్వం ఉంద‌ని.. సో.. ఇక్క‌డ జ‌గ‌న్‌ను తాము కంట్రోల్ చేస్తామ‌ని.. ఆ 7 వేల మందికి చెప్పేందుకు ప్లాన్ చేసుకుంటున్నార‌ని తెలిసింది. ఎలాగూ త‌మ‌కు బ‌లం లేదు క‌నుక‌.. ఇప్పుడు దానిని బూస్ట‌ప్ చేసుకునేందుకు విప‌రీతంగా ప్ర‌య‌త్నిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇప్పుడు చేస్తున్న ఈ క‌క్కుర్తి రాజ‌కీయం ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాల‌ని అంటున్నారు నెటిజ‌న్లు.