Begin typing your search above and press return to search.

పిల్ల‌ల‌పై ‘థ‌ర్డ్ వేవ్’.. ఐసీఎంఆర్‌ రిపోర్టు ఇదే!

By:  Tupaki Desk   |   28 Jun 2021 1:30 PM GMT
పిల్ల‌ల‌పై ‘థ‌ర్డ్ వేవ్’.. ఐసీఎంఆర్‌ రిపోర్టు ఇదే!
X
దేశానికి క‌రోనా ప్ర‌మాదం తొల‌గిపోలేద‌ని, థ‌ర్డ్ వేవ్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ఎయిమ్స్ డైరెక్ట‌ర్ వంటివారితోపాటు కేంద్ర ప్ర‌భుత్వం కూడా హెచ్చ‌రిక‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. మ‌రికొంద‌రు మాత్రం భిన్న‌మైన ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. కొవిడ్ వేవ్ కు ఛాన్స్ లేద‌ని, వ‌చ్చినా.. దాని ప్ర‌భావం పెద్ద‌గా ఉండ‌ద‌ని పూర్తి విరుద్ధ‌మైన అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఐసీఎంఆర్ కీల‌క అధ్య‌య‌నం చేసింది.

తొలి ద‌శ‌లో వృద్ధుల‌పై ప్ర‌భావం చూపింద‌ని, సెకండ్ వేవ్ యువ‌త మీదుగా వెళ్లిపోయింద‌ని, ఇక‌ థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం చూపేది చిన్న పిల్ల‌ల‌పైనే అనే ఆందోళ‌న వ్య‌క్త‌మైంది. దీనికి చెప్పిన రీజ‌న్ ఏమంటే.. 18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ లేదు కాబ‌ట్టి.. వారిపైనే ఎఫెక్ట్ చూపుతుంద‌ని అన్నారు. అయితే.. తాజాగా ఐసీఎంఆర్ నివేదిక మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉండ‌డం ఊర‌ట క‌లిగిస్తోంది.

క‌రోనా థ‌ర్డ్ వేవ్ వ‌స్తుంద‌ని చెప్ప‌డానికి ఆధార‌ల్లేవ‌ని చెప్పింది. ఒక‌వేళ వ‌చ్చినా.. సెకండ్ వేవ్ అంత తీవ్ర‌త ఉండ‌ద‌ని చెప్పింది. వ్యాక్సినేష‌న్ వేగంగా కొన‌సాగుతున్నందున‌.. వైర‌స్ తీవ్ర స్థాయిలో ప్ర‌భావం చూపే అవ‌కాశం లేద‌ని తెలిపింది. అదే స‌మయంలో కేవ‌లం పిల్ల‌ల‌పైనే ప్ర‌భావం చూపుతుంద‌ని చెప్ప‌డానికి కూడా కార‌ణాలు క‌నిపించ‌ట్లేద‌ని చెప్పింది.

కాగా.. ఇటీవ‌ల క‌ర్నాట‌క‌లోని ఇద్ద‌రు వైరాల‌జిస్టులు సైతం ఇదే అభిప్రాయం వ్య‌క్తం చేశారు. రిటైర్డ్ మైక్రోబ‌యాల‌జీ ప్రొఫెస‌ర్ విజ‌య అంచ‌నా ప్ర‌కారం.. థ‌ర్డ్ వేవ్ అనేది ఒక ఊహ మాత్ర‌మే. దీనికి ఎలాంటి ఆధార‌మూ లేదని అన్నారు. అయితే.. జాగ్ర‌త్త‌గా మాత్రం ఉండాల‌న్నారు. మ‌రో వైరాల‌జిస్టు జాక‌బ్ జాన్ ఓ అడుగు ముందుకు వేసి.. అస‌లు థ‌ర్డ్ వేవ్ అనేది లేనే లేద‌ని అన్నారు. ఈ సంవ‌త్స‌రం ముగిసే నాటికి క‌రోనా పూర్తిగా అంత‌మై పోతుంద‌ని కూడా ఆశాభావం వ్య‌క్తం చేశారు.

ఇప్పుడు ఐసీఎంఆర్ కూడా ఇదేవిధ‌మైన నివేదిక ఇవ్వ‌డం ఖ‌చ్చితంగా ఊర‌ట క‌లిగించేదే. అయితే.. అంద‌రూ మాత్రం త‌ప్ప‌కుండా జాగ్ర‌త్త పాటించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. జాగ్ర‌త్త‌లు పాటిస్తూనే.. ఈ మ‌హ‌మ్మారి అంత‌మైపోయే రోజుకోసం ఎదురు చూద్దాం.