Begin typing your search above and press return to search.

పాక్‌ కు ఐసీజే పంచ్‌.. మ‌నోడి ఉరిపై స్టే

By:  Tupaki Desk   |   18 May 2017 11:15 AM GMT
పాక్‌ కు ఐసీజే పంచ్‌.. మ‌నోడి ఉరిపై స్టే
X
అంత‌ర్జాతీయంగా పాకిస్థాన్ పాడుబుద్ధి మ‌రోసారి రుజువైంది. అక్ర‌మంగా అరెస్ట్ చేయ‌ట‌మే కాదు.. దుష్ట‌బుద్ధితో దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. అమాయ‌కుడికి ఉరి వేసిన వైనాన్ని అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం త‌ప్పు ప‌ట్టింది. పాక్ సైనిక‌ న్యాయ‌స్థానం ఇచ్చిన తీర్పును అమ‌లు చేయ‌కుండా నిలిపివేయాల‌ని స్టే జారీ చేసింది. దీంతో.. మ‌నోడు కుల్‌భూష‌ణ్ జాద‌వ్ (46) పై భార‌త్ చేస్తున్న వాద‌న‌ను అంత‌ర్జాతీయ కోర్టు కూడా స‌మ‌ర్థించిన‌ట్లైంది. అదే స‌మ‌యంలో.. పాక్ క‌ప‌ట‌త్వం ప్ర‌పంచానికి మ‌రోసారి తెలిసేలా చేసింది.

తాజా తీర్పు పాక్‌కు చెంప‌పెట్టుగా మార‌గా.. భార‌త్‌కు ఘ‌న‌విజ‌యంగా అభివ‌ర్ణించొచ్చు. కుల‌భూష‌ణ్ జాద‌వ్‌కు పాక్ కోర్టు విధించిన ఉరిని ఎట్టి ప‌రిస్థితుల్లో అమ‌లు చేయొద్ద‌ని అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేయ‌ట‌మే కాదు.. జాద‌వ్‌ను క‌లుసుకునేందుకు భార‌త రాయ‌బారికి అవ‌కాశం క‌ల్పించాల‌ని స్ప‌ష్టం చేయ‌టం గ‌మ‌నార్హం. నెద‌ర్లాండ్స్‌లోని హేగ్ న‌గ‌రంలో ఉన్న ఐక్య‌రాజ్య‌స‌మితి ప్ర‌ధాన న్యాయ‌విభాగం ఐసీజేలో కుల‌భూష‌ణ్ జాద‌వ్ ఉదంతంపై భార‌త్ - పాక్ లు త‌మ వాద‌న‌లు వినిపించాయి. వారి వాద‌న‌లు విన్న అనంత‌రం జ‌స్టిస్ రోనీ అబ్ర‌హం తాజా తీర్పును వెల్ల‌డించారు.

గూఢ‌చ‌ర్య‌.. విద్రోహ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారంటూ గ‌త నెల‌లో కుల‌భూష‌ణ్ జాద‌వ్‌ను పాక్ సైనిక‌న్యాయ‌స్థానం ఉరిశిక్ష విధించింది. బెలూచిస్తాన్ ప్రాంతంలో ఉగ్ర‌వాద కార్య‌కలాపాలు చేస్తూ త‌మ దేశానికి వ్య‌తిరేకంగా కుట్ర‌లు ప‌న్నుతున్న‌ట్లుగా పాక్ ఆరోపించింది. అయితే.. కుల‌భూష‌ణ్ జాద‌వ్‌ను ఇరాన్ నుంచి అక్ర‌మంగా కిడ్నాప్ చేసి.. పాక్‌కు తీసుకెళ్లి కేసు పెట్టిన‌ట్లుగా భార‌త్ వాదించింది. అంతేకాదు.. వియ‌న్నా ఒప్పందాన్ని తోసిరాజ‌న్న‌ట్లుగా పాక్ వ్య‌వ‌హ‌రించింద‌న్న విష‌యాన్ని భార‌త్ ప్ర‌ముఖంగా వాదించింది.

దీనికి ప్ర‌తిగా పాక్ త‌న వాద‌న‌ను వినిపించింది. భార‌త్ వాద‌న‌ను ఖండించింది. అయితే.. ఇరు దేశాల వాద‌న‌లు విన్న అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం భార‌త్ వాద‌నను స‌మ‌ర్థిస్తూ త‌న తీర్పును వెల్ల‌డించింది. భార‌త్ త‌ర‌ఫున ప్ర‌ముఖ న్యాయ‌వాది హ‌రీశ్‌సాల్వే వాద‌న‌లు వినిపించ‌గా.. పాక్ త‌ర‌ఫున అస్త‌ర్ అలీ వాద‌న‌లు వినిపించారు. సుప్రీంకోర్టు సీనియ‌ర్ న్యాయ‌వాది అయిన హ‌రీశ్ సాల్వే.. ఈ కేసును వాదించేందుకు కేవ‌లం ఒక్క రూపాయి మాత్ర‌మే పారితోషికంగా తీసుకోవ‌టం విశేషం.

తాజా తీర్పులో ప్ర‌స్తావించిన మూడు అంశాల్ని చూస్తే..

1. విదేశీ పౌరుడ్ని అరెస్ట్ చేసే స‌మ‌యంలో స‌ద‌రు దేశ కాన్స‌ల్ జ‌న‌ర‌ల్‌కు అత‌డిని క‌లిసే అవ‌కాశం క‌ల్పించాల‌ని వియ‌న్నా ఒప్పందం చెబుతోంది. పాక్ మాత్రం ఆ అవ‌కాశం ఇవ్వ‌లేదు.

2. జాద‌వ్ కేసు అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం ప‌రిధిలోకి రాద‌న్న వాద‌న‌ను కొట్టిపారేసింది. భార‌త దౌత్యాధికారులు జాద‌వ్‌ను క‌లుసుకునే హ‌క్కు ఉంద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది.

3. పాక్ సైనిక కోర్టు విధించిన ఉరిశిక్ష‌పై స్టే విధించ‌ట‌మే కాదు.. త‌మ త‌దుప‌రి ఆదేశాలు వెల్ల‌డ‌య్యే వ‌ర‌కూ ఉరిశిక్ష‌ను ఎట్టిప‌రిస్థితుల్లో అమ‌లు చేయ‌కూడ‌ద‌ని పేర్కొంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/