Begin typing your search above and press return to search.

ఐఏఎస్‌ అధికారి సీటుకు ఎసరు తెచ్చిన డ్యాన్సు

By:  Tupaki Desk   |   9 April 2015 6:23 PM IST
ఐఏఎస్‌ అధికారి సీటుకు ఎసరు తెచ్చిన డ్యాన్సు
X
ఆయనో ఐఏఎస్‌ అధికారి... తాను పనిచేసే ఏరియాలో షూటింగ్‌ జరిగితే అక్కడకు వెళ్లి స్టెప్పులేశారు... అయితే అవి కాస్త అసభ్యంగా ఉండడంతో ప్రభుత్వానికి చిర్రెత్తింది. ఇంకేముంది... ఏమాత్రం ఊరుకున్నా ప్రజలు ప్రభుత్వాన్ని చూసి నవ్వుతారన్న ఉద్దేశంతో ప్రభుత్వమే ఆయనపై వేటు వేసింది.

జార్ఘండ్‌ రాష్ట్రంలో ఓ ఐఏఎస్‌ అధికారి వేసిన గంతులు ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించాయి. దీంతో ఆ ఉన్నతాధికారిని వేరే శాఖకు బదిలీచేసింది. చిల్కారి ఏక్‌ దర్ద్‌ అనే సినిమా షూటింగ్‌లో నటించేందుకు వెళ్లిన డిప్యూటీ కమిషనర్‌ స్థాయి అధికారి దినేష్‌ ప్రసాద్‌, సినీ డాన్సర్లతో కలిసి డ్యాన్సు కుమ్మేశాడు. దీన్ని వెలుగులోకి తేవడంతో వివాదం మొదలైంది.. 2007లో ఒకే గ్రామానికి చెందిన 19మంది గ్రామస్థుల ఊచకోత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ లో సినీ ఆర్టిస్టులతో కలిసి ఐఏఎస్‌ ఆఫీసర్‌ దినేష్‌ హల్‌చల్‌ చేసిన దృశ్యాలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారాయి. జార్ఖండ్‌ ముక్తి మోర్చా దీనిపై ఆందోళనకు దిగింది. ఈ సినిమాపై వివాదం ఉన్న నేపథ్యంలో షూటింగ్‌ను నిలుపుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్నారు. సినిమా నిషేధంకోసం కోర్టుకు వెళతామని తెలిపారు. అయితే ఐఏఎస్‌ అధికారి దినేష్‌ ప్రసాద్‌ తన వైఖరిని సమర్థించుకున్నారు. డ్యూటీ అయిపోయిన తర్వాత సినిమాలో నటిస్తే తప్పేముందని ఆయన అంటున్నారు.

అయితే 2007లో జరిగిన ఈ హత్యాకాండ నుంచి త్రుటిలో తప్పించుకున్న మాజీముఖ్యమంత్రి బాబూలాల్‌ మరాండీ సోదరుడు నూను మరాండీ ఈ సినిమాను నిషేధించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మావోయిస్టు కమ్యూనిస్ట్‌ సెంటర్‌ (ఎంసిసి) తీవ్రవాదుల దాడిలో ఒక ఎంపీ, మాజీముఖ్యమంత్రి బాబూలాల్‌ మరాండీ కుమారుడితో పాటు ఒకే గ్రామానికి చెందిన 19మంది హతమైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సంఘటన ఆధారంగానే ఈ సినిమా తీస్తున్నారు.