Begin typing your search above and press return to search.

ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై ట్వీట్లు.. ఐఏఎస్ అధికారికి షోకాజ్ నోటీసు!

By:  Tupaki Desk   |   24 March 2022 8:48 AM GMT
ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై ట్వీట్లు.. ఐఏఎస్ అధికారికి షోకాజ్ నోటీసు!
X
ది కశ్మీర్ ఫైల్స్.. ఇప్పుడు దేశాన్ని ఈ సినిమా షేక్ చేస్తోంది. కశ్మీర్ లోయలో పండింట్లపై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన మారణహోమాన్ని ప్రధాన అంశంగా తెరకెక్కించిన 'ది కశ్మీరీ ఫైల్స్' చిత్రంపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఈ సినిమాకు బీజేపీ పాలిత రాష్ట్రాలు పన్ను మినహాయింపు ఇచ్చాయి. అలాగే.. సినిమా చూసేందుకు పోలీసులకు సెలవు కూడా మంజూరు చేస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. 'ది కశ్మీరీ ఫైల్స్' చిత్రంపై ట్విట్టర్ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఐఏఎస్ అధికారి నియాజ్ ఖాన్ కు నోటీసులు జారీ చేసినట్లు మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా వెల్లడించారు. ప్రజా పనుల విభాగం డిప్యూటీ సెక్రటరీ నియాజ్ ఖాన్ గత వారం ట్విట్టర్ లో ఈ సినిమాపై వ్యాఖ్యలు చేశారు.

'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రాన్ని తీసినవారు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో జరుగుతున్న ముస్లింల హత్యలపై ఓ సినిమా తీయాలని వ్యాఖ్యానించారు. మైనార్టీలు పురుగులు కాదని.. కానీ వీరు దేశ పౌరులని ఘాటుగా ట్వీట్ చేశారు. దేశంలోని ముస్లింల ఊచకోతను ఎత్తిచూపుతూ ఒక పుస్తకాన్ని రాయాలని యోచిస్తున్నానని.. తద్వారా మైనారిటీల వ్యథలను భారతీయుల ముందుకు తీసుకురావడానికి ఎవరైనా 'ది కశ్మీర్ ఫైల్స్' వంటి చిత్రాన్ని నిర్మించవచ్చని ఐఏఎస్ అధికారి అన్నారు. అంతేకాదు చిత్రానికి వచ్చిన ఆదాయం మొత్తాన్ని కశ్మీరీ పండిట్ల పిల్లల విద్య , ఇళ్ల నిర్మాణానికి నిర్మాత ఖర్చు చేయాలని సూచించారు.

దీన్ని మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా మీడియాతో మాట్లాడారు. 'ఐఏఎస్ అధికారి ఖాన్ ట్వీట్లను చూశాను. ఇది చాలా తీవ్రమైన అంశం. ఆయన ప్రభుత్వ నిబంధనలు అధిగమించి లక్ష్మణ రేఖ దాటారు. దీనిపై వివరణ కోరుతూ షోకాజ్ నోటీస్ జారీ చేస్తాం' అని తెలిపారు.

ఐఏఎస్ నియాజ్ ఖాన్ ట్వీట్ పై కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి స్పందించారు. నియాజ్ ఆలోచనలు పంచుకోవాలని ఉందని.. ఇందుకు నియాజ్ అపాయింట్ మెంట్ కావాలని కోరారు.

మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి సారంగ్ కూడా ఐఏఎస్ నియాజ్ ఖాన్ పై మండిపడ్డారు. ఈ ఐఏఎస్ మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని.. ఆయనకు వ్యతిరేకంగా వ్యక్తిగత సిబ్బంది వ్యవహారాల శాఖకు లేఖ రాయనున్నట్లు తెలిపారు.