Begin typing your search above and press return to search.

కుక్క తీరు చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు

By:  Tupaki Desk   |   20 March 2015 9:52 AM GMT
కుక్క తీరు చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు
X
మనిషికి ఉండాల్సిన విశ్వాసం.. ప్రేమ.. అభిమానం రోజురోజుకీ తగ్గిపోతుంటే.. కుక్కలకు స్వభావ సిద్ధంగా ఉండే విశ్వాసం మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. తాజాగా చోటు చేసుకున్న ఒక ఘటన చూసిన వారినేకాదు.. ఆ ఘటన గురించి తెలిసిన వారు సైతం కదిలిపోతున్నారు.

ఛత్‌.. కుక్కకున్న విశ్వాసం కూడా మనుషులకు ఉండటం లేదే? అని తమను తాము తిట్టేసుకునే పరిస్థితి. ఇంతకీ ఆ కుక్క ఎవరిది? ఎక్కడుంటుంది? ఏం చేసింది? అంటే..

రియల్‌.. ఇసుక మాపియా కారణంగా హత్యకు గురయ్యారని భావిస్తున్న కర్ణాటక ఐఏఎస్‌ అధికారి డీకే రవికుమార్‌ మరణం తర్వాత పోస్ట్‌ మార్టం నిర్వహించారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని ఇంటికి తీసుకొచ్చారు. 36 ఏళ్ల రవికుమార్‌ నీతికి.. నిజాయితీకి నిలువెత్తు ప్రతిరూపం. అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టించిన ఆయన.. సమాజానికి మంచి చేయాలని తపించే వారని చెబుతుంటారు.

పేద ప్రజల కన్నీళ్లు తుడవాలన్న సదుద్దేశ్యంతో పని చేసే ఆయన.. ముక్కుసూటిదనంతో ముందుకెళ్లటంతో ఆయన్ని అన్యాయంగా పొట్టన బెట్టేసుకున్నారన్న వాదన వినిపిస్తోంది.

ఆయన భౌతికకాయాన్ని చూసిన కుటుంబ సభ్యులు అంతా తల్లడిల్లిపోతుంటే.. వారికి మిన్నగా రవికుమార్‌ ప్రేమతో పెంచుకునే కుక్క విలవిలలాడిపోయింది. రవికుమార్‌ భౌతికకాయాన్ని వదలకుండా ఉండిపోవటమే కాదు.. కన్నీళ్లు కార్చిన వైనం చూసినప్పుడు.. తన ఆకలి తీర్చిన యజమాని మరణానికి తల్లడిల్లిపోయిన దృశ్యాన్ని చూసి వారు కదిలిపోయారు. రవికుమార్‌ మరణం కుక్కను సైతం కదిలించివేసినా.. కర్ణాటక ప్రభుత్వాన్ని మాత్రం కదిలించలేకపోతోంది. ఆయన మృతిపై సీబీఐ విచారణ చేయించాలన్న అంశంపై ససేమిరా అంటూ మొండి పట్టు పడుతోంది. సీబీఐ విచారణకు ఆదేశిస్తే కర్ణాటక సర్కారుకు పోయేదేమిటో..?