Begin typing your search above and press return to search.

ఎంత మాట మోడీ.. మీ ఇంట్లో సోదాలు చేయ‌ట‌మా?

By:  Tupaki Desk   |   27 April 2019 7:30 AM GMT
ఎంత మాట మోడీ.. మీ ఇంట్లో సోదాలు చేయ‌ట‌మా?
X
ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో విచార‌ణ సంస్థ‌లు సోదాలు చేయ‌టం ఎప్పుడైనా విన్నామా? ఎక్క‌డైనా చూశామా? అన్న క్వ‌శ్చ‌న్లు రాకుండా ఉండేలా.. అలాంటి ఎన్నో అనుభ‌వాల్ని చేతల్లో చూపించేశారు మోడీ మాష్టారు. త‌న తొలి ఐదేళ్ల ప‌ద‌వీకాలంలో స్వ‌తంత్య్ర ద‌ర్య‌ప్తు సంస్థ‌లకు చేతినిండా ప‌ని పెట్టిన వైనాన్ని ఇప్ప‌ట్లో ఎవ‌రూ మ‌ర్చిపోలేరు. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల్ని.. శ‌త్రువులుగా చూస్తూ ఏం చేయొచ్చ‌న్న విష‌యాన్ని మోడీ స‌ర్కారు చెప్ప‌క‌నే చెప్పేసింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ హెలికాఫ్ట‌ర్ ను ఎన్నిక‌ల సంఘం అధికారులు తనిఖీలు నిర్వ‌హించారు. యాదృశ్చికంగా అదే రోజు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ హెలికాఫ్ట‌ర్ ను త‌నిఖీ చేశారు ఐఏఎస్ అధికారి ఒక‌రు. ఒడిశా సీఎం చాప‌ర్ ను త‌నిఖీ చేసిన వారి విష‌యంలో ఏమీ జ‌ర‌గ‌కున్నా.. ప్ర‌ధాని మోడీ హెలికాఫ్ట‌ర్ ను త‌నిఖీ చేసిన ఐఏఎస్ అధికారి మ‌హ్మ‌ద్ మొహిసిన్ (క‌ర్ణాట‌క క్యాడ‌ర్) మీద మాత్రం చ‌ర్య‌లు తీసుకోవ‌టం.. స‌స్పెన్ష‌న్ వేటు వేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

దీంతో.. నిబంధ‌నల ప్రకారం ఎవ‌రి మీద‌నైనా.. ఏమైనా చేయొచ్చు కానీ.. మోడీ మాష్టారి విష‌యంలో ఆచితూచి అడుగులు వేయాల‌న్న సందేశాన్ని చెప్ప‌క‌నే చెప్పేసిన‌ట్లుగా చెప్పాలి. ఇదిలా ఉంటే.. త‌ప్పు చేస్తే త‌న ఇంట్లో కూడా సోదాలు నిర్వ‌హించొచ్చ‌ని మోడీ వ్యాఖ్యానించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. చ‌ట్టం దృష్టిలో అంద‌రూ స‌మాన‌మేన‌ని చెప్పిన ఆయ‌న మాట‌లు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. ఆదాయ‌ప‌న్ను విభాగంతో ప్ర‌తిప‌క్ష నేత‌లమీద దాడులు చేస్తున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు అంత‌కంత‌కూ పెరిగిపోతున్న వేళ‌.. మోడీ వ్యాఖ్యాలు ప్రాధాన్య‌తను సంత‌రించుకున్నాయి. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. త‌న‌కు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు ప‌వ‌ర్ లో ఉన్న రాష్ట్రాల్లో అధికార‌ప‌క్షం నేత‌ల‌పై అదే ప‌నిగా సోదాలు నిర్వ‌హించే ఐటీ..ఈడీలు.. మిగిలిన రాష్ట్రాల్లోమాత్రం కామ్ గా ఉండ‌టం దేనికి సంకేతం? కొన్ని రాష్ట్రాల మీదా.. కొన్ని రాజ‌కీయ ప‌క్షాల మీద క‌త్తి క‌ట్టిన‌ట్లుగా ఉండే చ‌ర్య‌లు.. మిగిలిన వారి ఊసే ఎందుకు క‌నిపించ‌దు? అన్న‌ది మ‌రో ప్ర‌శ్న‌.

ఇలాంటివేళ‌.. తాన త‌ప్పు చేసిన‌ట్లు భావిస్తే త‌న ఇంట్లో సోదాలు చేసుకోవ‌చ్చ‌న్న ప్ర‌ధాని మోడీ మాట‌లు వింటే.. ఆయ‌న మాట‌ల‌కు చేత‌ల‌కు మ‌ధ్య‌నున్న వ్య‌త్యాసం ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఎన్నిక‌ల వేళ‌.. సోదాలు నిర్వ‌హించే క్ర‌మంలో భాగంగా ప్ర‌ధాని హెలికాఫ్ట‌ర్ ను సోదాలు నిర్వ‌హించిన అధికారిపై వేటు ప‌డిన వైనం ఇంకా ప‌చ్చిగా ఉన్న వేళ‌.. త‌న ఇంట్లో సోదాలు చేయొచ్చ‌న్న మోడీ మాష్టారి మాట రావ‌టం ఆస‌క్తిక‌రఅంశం. అయినా.. న‌మో ఇంట్లో సోదాలు నిర్వ‌హించే ద‌మ్ము.. ధైర్యం దేశంలో ఏ అధికారికైనా ఉందంటారా?