Begin typing your search above and press return to search.

గాంధీ ఆసుపత్రిపై పూలవర్షం కురిపించిన వాయుసేన!

By:  Tupaki Desk   |   3 May 2020 6:30 AM GMT
గాంధీ ఆసుపత్రిపై పూలవర్షం కురిపించిన వాయుసేన!
X
తెలంగాణ రాష్ట్రానికి కరోనా ఆసుపత్రి అన్నంతనే సికింద్రాబాద్ లోని గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి గుర్తుకు వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కరోనా పాజిటివ్ వచ్చినా సరే.. నేరుగా తీసుకొచ్చి గాంధీలో అడ్మిట్ చేయటమే. ప్రభుత్వ ఆసుపత్రే అయినా.. మందులేని కరోనాను కంట్రోల్ చేయటంలో గాంధీకున్న సక్సెస్ రేటు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

రోజుల పసికందు మొదలు పండుటాకు వరకూ తమ వద్దకు వచ్చిన కరోనా పాజిటివ్ ల విషయంలో కమిట్ మెంట్ తో పని చేసి వందలాది ప్రాణాల్ని కాపాడారు. తెలంగాణలోని కరోనా మరణాల్ని చూస్తే.. వైద్యుల కారణాల కంటే కూడా ఇతర అంశాలే ఎక్కువగా కనిపిస్తాయి. అరకొర వసతులతో ఉండే ప్రభుత్వ ఆసుపత్రులన్న ఇమేజ్ కరోనా ఎపిసోడ్ తో చెరిగిపోయిందనే చెప్పాలి.

కరోనా కేసుల విషయంలో సక్సెస్ రేటు సికింద్రాబాద్ గాంధీలో ఎక్కువన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడి వైద్యులు.. వైద్య సిబ్బంది చేస్తున్న పని తీరుపై పలువురు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. వారి సేవలకు గుర్తింపుగా ఈ రోజు (ఆదివారం) ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో భారత వాయుసేనకు చెందిన విమానం.. గాంధీ ఆసుపత్రిపై పూలవర్షాన్ని కురిపించింది. గాంధీ వైద్య సిబ్బంది చేస్తున్న కృషికి నిదర్శనంగా పూలవర్షాన్ని కురిపించినట్లుగా చెబుతున్నారు.

తమ పని తీరును గుర్తించటమే కాదు.. తమకున్న సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పూలవర్షం కురిపించటంపై గాంధీ సిబ్బంది సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అదే సమయంలో.. ఈ వ్యవహారంపై నాలుగోతరగతి సిబ్బంది.. మరికొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు. తమ కష్టాన్ని గుర్తించినట్లుగా పూలవర్షం బాగానే ఉన్నా.. ప్రాణాలకు తెగించి మరీ సేవలు అందిస్తున్న దానికి ప్రతిఫలంగా ఇస్తున్న వేతనాలు సవరిస్తే మరింత బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. నిజమే.. ఆలోచించాల్సిన పాయింటే.