Begin typing your search above and press return to search.

ఆ నేతను.. ఖైదీలతో మూడు నెలలు కొట్టించారట

By:  Tupaki Desk   |   27 Jun 2015 11:07 AM IST
ఆ నేతను.. ఖైదీలతో మూడు నెలలు కొట్టించారట
X
నలభై ఏళ్ల కిందట నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితిని చీకటి రోజులుగా ఎందుకు అభివర్ణిస్తారు? అసలు అప్పట్లో ఏం జరిగిందన్న మాటకు చాలామంది చెప్పే విషయాల్లో తీవ్రత ఇప్పటి తరానికి పెద్దగా అర్థం కావు. కానీ.. డీఎంకే కీలక నేత.. తమిళ రాజకీయాల్ని ఎప్పటికైనా ప్రభావితం చేయగలిగిన సత్తా ఉన్న నేతగా పేరున్న స్టాలిన్‌ చెప్పే మాటలు వింటే.. ఔరా అనిపించక మానదు.

అత్యవసర పరిస్థితిని విధించిన సమయంలో.. కనిపించిన ప్రతి ఒక్క రాజకీయ నాయకుడ్ని జైల్లో పడేసే నాటి సర్కారు.. నేతలు జైల్లోకి పడేసిన తర్వాత కూడా వారికి నరకం అంటే ఏమిటోచూపించారని చెబుతారు.

ఆ విషయాల్ని స్టాలిన్‌ మాటల్లో చెప్పాలంటే.. ''1975లో ఎమర్జెన్సీ విధించినప్పుడు నాతో పాటు మురసోలి మారన్‌.. మరో 120 మందిని చెన్నైలోనిసెంట్రల్‌ జైల్లో వేశారు. జైలర్‌ మా పట్ల దారుణంగా వ్యవహరించే వారు. జీవితఖైదు పడిన ఖైదీల చేత మూడు నెలల పాటు మమ్మల్ని కొట్టించాడు. నిజానికి డీఎంకే ఎంపీ చిట్టిబాబు మమ్మల్ని బతికేలా చేశాడు. జైల్లో తిన్న దారుణమైన దెబ్బల కారణంగా ఆయన మృత్యువాత పడ్డారు. దీంతో.. మమ్మల్ని కొట్టే విషయంలో కాస్త తీవ్రత తగ్గించారు. ఎమర్జెన్సీ విధించిన సమయంలో ఏడాది పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఆ రోజులు చాలా దారుణం'' అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు తిరుగులేని నేతల్లో ఒకరిగా చెప్పే వ్యక్తికి.. నలభై ఏళ్ల కిందట ఎలాంటి పరిస్థితి ఉండేదన్న విషయం ఆయన నోటి నుంచే విన్నప్పుడు షాకింగ్‌గా అనిపించటం ఖాయం.