Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే అవుదాం అనుకున్నా .. మంత్రులతో ప్రమాణం చేయిస్తున్నా!

By:  Tupaki Desk   |   2 March 2021 9:00 AM IST
ఎమ్మెల్యే అవుదాం అనుకున్నా .. మంత్రులతో ప్రమాణం చేయిస్తున్నా!
X
తెలంగాణ గవర్నర్ తమిళ సై .. ఈ మద్యే కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ గా భాద్యతలు స్వీకరించారు. పుదుచ్చేరి ఎల్జీగా కొనసాగిన కిరణ్‌ బేడీని రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా కేంద్ర ప్రభుత్వం తొలగించింది. దీనితో తెలంగాణ గవర్నర్‌ అయిన తమిళిసైకి అదనపు బాధ్యతలు అప్పగించారు. పుదుచ్చేరిలో కిరణ్‌ బేడీ సహా నలుగురు మహిళలు లెఫ్టినెంట్‌ గవర్నర్లుగా పని చేశారు. తమిళం మాట్లాడే వ్యక్తిని గవర్నర్‌ గా నియమించడం ఇదే తొలిసారి. పుదుచ్చేరి గవర్నర్ ‌గా నియమితులు కావడం ఆనందంగా ఉందన్నారు తమిళిసై. రెండేళ్లుగా తెలంగాణ గవర్నర్‌గా పనిచేసిన అనుభవంతో పుదుచ్చేరి రాష్ట్రాభివృద్ధికి కృషిచేస్తానని ఆమె చెప్పారు.

ఇదిలా ఉంటే .. నేను ఎమ్మెల్యే అవుదాం అనుకున్నా కానీ అది కుదరలేదు. ప్రస్తుతం మంత్రుల చేత ప్రమాణం చేయించే ఉన్నతమైన హోదా పొందా అని తెలంగాణ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై ‌ అన్నారు. తెలంగాణా గవర్నర్‌ గా ఇంగ్లీష్ లో ప్రమాణస్వీకారం చేసిన తాను మాతృభాష తమిళంలో ప్రమాణం చేయాలని ఆశ పడ్డానని, ఆ ఆశ పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ గా ప్రమాణం చేసినప్పుడు నెరవేరిందని చెప్పారు.

ఇక ఆదివారం ఆమె కన్యాకుమారి జిల్లా మండక్కాడు భగవతి అమ్మన్‌ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను ఎక్కడ ఉన్నా, ఏ పదవిలో ఉన్నా మండక్కాడు భగవతి అమ్మవారి ఆలయాన్ని మాత్రం తప్పక సందర్శిస్తుంటానని తెలిపారు. అలాగే ప్రస్తుతం దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా తగ్గలేదని, ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆలయాల్లో బిల్వదళాలు, తులసి ఆకులను పూజచేసి ప్రసాదంగా ఇస్తున్నారని, వాటిని సేవిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు.