Begin typing your search above and press return to search.

భర్తను ఈడీ ఆఫీసుకు తెచ్చిన ప్రియాంకా గాంధీ

By:  Tupaki Desk   |   6 Feb 2019 10:35 PM IST
భర్తను ఈడీ ఆఫీసుకు తెచ్చిన ప్రియాంకా గాంధీ
X
రాహుల్ గాంధీని అండగా చిట్టచివరి అస్త్రంగా కాంగ్రెస్ పార్టీ పరీక్షిస్తోన్న అస్త్రం ప్రియాంకా గాంధీ. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టి మరీ ఆమెను ఈ ఎన్నికల క్షేత్రంలోకి దించుతున్నారు. అయితే.. ప్రియాంక ఎలివేషన్ సమయంలోనే ఆమె భర్త ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. మనీల్యాండరింగ్‌ కేసులో ఈనెల ఆరున ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాలని గతవారం ముందస్తు బెయిల్‌కు వాద్రా దరఖాస్తు చేసుకున్న క్రమంలో ఢిల్లీ కోర్టు ఆయనను ఆదేశించడంతో ప్రియాంక సహా ఆయన ఈడీ కార్యాలయానికి వచ్చారు.

లండన్‌లో పలు స్ధిరాస్ధుల కొనుగోలు, స్వాధీనానికి సంబంధించి మనీల్యాండరింగ్‌ కేసులో వాద్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా, ఢిల్లీ కోర్టు వాద్రాకు ఈనెల 16 వరకూ మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. కాగా లండన్‌లో స్ధిరాస్తుల కొనుగోలుకు సంబంధించిన లావాదేవీలు, ఆస్తుల వివరాలపై వాద్రాను ప్రశ్నించిన ఈడీ మనీల్యాండరింగ్‌ చట్టం కింద ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది.

మరోవైపు వాద్రాను ఈడీ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలతో విరుచుకుపడింది. యూపీఏ హయంలో రాబర్ట్‌ వాద్రా భారీగా లబ్దిపొందారని, ఈ మొత్తంతో వాద్రా విదేశాల్లో కోట్లాది రూపాయలతో విలాసవంతమైన ఆస్తులను కొనుగోలు చేశారని బీజేపీ ప్రతినిధి సంబిట్‌ పాత్ర ఆరోపించారు.

కాగా... రాబర్ట్‌ను ఈడీ కార్యాలయం వద్ద దించిన తరువాత ప్రియాంక నేరుగా కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లారు. భర్త ఈడీ విచారణ ఎదుర్కొంటుండంపై ఆమె మాట్లాడుతూ.. "ఏం జరుగుతోందో మొత్తం ప్రపంచానికి తెలుసు" అన్నారు.