Begin typing your search above and press return to search.

ఆ ఎంపీ బొట్టు..మంగ‌ళ‌సూత్రం ఇప్పుడు వివాద‌మైంది!

By:  Tupaki Desk   |   30 Jun 2019 4:41 AM GMT
ఆ ఎంపీ బొట్టు..మంగ‌ళ‌సూత్రం ఇప్పుడు వివాద‌మైంది!
X
పుట్టిన మ‌తం ఏదైనా కావొచ్చు. కానీ.. అందులో కొన‌సాగుతామా? లేదా? మార్పులు చేసుకుంటామా? అన్న‌ది వ్య‌క్తిగ‌త ఇష్టాయిష్టాల‌కు అనుగుణంగా ఉంటుంది. అలాంటి వాటిని త‌ప్పు ప‌డుతూ ఫ‌త్వా జారీ చేయ‌టం ఇప్పుడు క‌ల‌క‌లంగా మారింది. అలా వ్య‌వ‌హ‌రించిన వ్య‌క్తి ఒక ఎంపీ కావ‌టం ఒక విశేష‌మైతే.. ఇంత‌టి స్థానంలోనే ఉంటేనే ఇలాంటి ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఉంటే.. మామూలు వాళ్ల ప‌రిస్థితి ఏమిట‌న్న సందేహం రాక మాన‌దు. ఒక మ‌హిళా ఎంపీ నుదిటిన సింధూరం.. మెడ‌లో మంగ‌ళ‌సూత్రం వేసుకొని లోక్ స‌భ‌కు రావ‌టాన్ని మ‌త‌పెద్ద‌లు త‌ప్పుప‌ట్ట‌టం ఇప్పుడు కొత్త చ‌ర్చ‌కు తెర తీసింది.

ఇంత‌కూ ఆ ఎంపీ ఎవ‌రు? మ‌త పెద్ద‌లు ఎందుకు ప్ర‌శ్నిస్తున్నారు? ఇంత‌కీ వివాదం ఏమిటి? ఎందుకిలాంటి పరిస్థితి చోటు చేసుకుంది? అన్న వివ‌రాల్లోకి వెళితే.. న‌టిగా పేరు తెచ్చుకొని తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీగా ఇటీవ‌ల 3.5లక్ష‌ల ఓట్ల మెజార్టీతో గెలిచారు న‌టి క‌మ్ నాయ‌కురాలు నుస్ర‌త్ జ‌హాన్ రూహి. న‌టిగా సుప‌రిచితురాలైన ఆమె ఒక జైన్ యువ‌కుడ్ని పెళ్లాడారు. ఫైర్ బ్రాండ్ ఎంపీగా పేరును సొంతం చేసుకుంటున్న ఆమెపైన తాజాగా దేవ్ బంద్ మ‌త పెద్ద‌లు ఫ‌త్వా జారీ చేశారు.

ముస్లిం యువతులు కేవ‌లం ముస్లిం యువ‌కుల్ని మాత్ర‌మే పెళ్లాడాల‌ని పేర్కొన‌టం గ‌మ‌నార్హం. తాజాగా మ‌త పెద్ద ముప్తీ అస‌ద్ ఫ‌జిమి మాట్లాడుతూ.. నుస్ర‌త్ ఒక జైన్ యువ‌కుడ్ని పెళ్లాడార‌ని.. ఇస్లాం ప‌ర‌కారం ముస్లిం మ‌రో ముస్లింను మాత్ర‌మే పెళ్లి చేసుకునే అవ‌కాశం ఉంద‌న్నారు. నుస్ర‌త్ ఒక న‌టి అని.. ఇలాంటి న‌టులు మ‌తం గురించి ప‌ట్టించుకోర‌ని.. వాళ్ల‌కు న‌చ్చిన దానిని చేయాల‌నుకుంటార‌ని.. అదే చేస్తార‌న‌నారు. సింధూరం.. మంగ‌ళ‌సూత్రం ధ‌రించి పార్ల‌మెంటుకు హాజ‌ర‌య్యార‌ని.. అలాంటి ఆమె గురించి మాట్లాడ‌టం వేస్ట్ అన్నారు.

ఆమె జీవితంలో జోక్యం చేసుకోమ‌ని.. ష‌రియా ఏం చెబుతుందన్న‌ది విష‌యాన్ని మాత్ర‌మే తాము చెబుతున్నామ‌న్నారు. మ‌త పెద్ద‌ల మాట‌ల‌పై బీజేపీ నేత సాధ్వి ప్రాచి మ‌ద్ద‌తుగా నిలిచారు. ముస్లిం మ‌హిళ ఒక హిందువును పెళ్లాడి.. బొట్టు పెట్టుకొని.. మంగ‌ళ‌సూత్రం ధ‌రిస్తే అదేదో పాపం చేసిన‌ట్లుగా చెప్ప‌టాన్ని ఖండించారు. మ‌రి చాలామంది ముస్లిం పురుషులు హిందూ అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని వారి చేత బుర‌ఖాలు ధ‌రింప‌జేయ‌టం పాపం కాదా? అని ప్ర‌శ్నించారు.

ఎవ‌రు ఎవ‌రికి న‌చ్చిన వాళ్ల‌ను పెళ్లి చేసుకునే ఈ రోజుల్లో ఒకరి వివాహాన్ని.. వివాహం త‌ర్వాత ఇలానే ఉండాల‌న్న క‌ట్ట‌బాట్ల‌ను ఎత్తి చూప‌టం.. ఫ‌త్వా జారీ చేయ‌టం వ్య‌క్తిగ‌త స్వేచ్చ‌లోని చొర‌బ‌డ‌టం కాదా? అన్న‌దిప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఒక ఎంపీనే ఇలాంటి ప‌రిస్థితి ఎదుర్కొంటే సామాన్యుల ప‌రిస్థితేంటి?