Begin typing your search above and press return to search.

రౌడీషీట్ తీయమని నేను బాబును అడగలేదు - చింత‌మనేని

By:  Tupaki Desk   |   2 Feb 2022 3:30 AM GMT
రౌడీషీట్ తీయమని నేను బాబును అడగలేదు -  చింత‌మనేని
X
ఏపీ రాజకీయాల గురించి తెలిసిన వారికి మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ గురించి ప్ర‌స్తావించాల్సిన అవ‌స‌రం లేదు. త‌నదైన ఫైర్‌బ్రాండ్ రాజ‌కీయాల‌తో ఆయ‌న ఏపీ రాజ‌కీయాల్లో ఓ ముద్ర వేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ రాజ‌కీయాల‌కు భిన్నంగా త‌న దూకుడుతో ఆయ‌న ముందుకు సాగుతుంటారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురించి కీల‌క కామెంట్లు చేశారు. ఇక త‌న‌పై ఉన్న దూకుడు స్వ‌భావం ఇమేజ్‌ గురించి సైతం చింత‌మ‌నేని క్లారిటీ ఇచ్చారు.

చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌ అంటేనే ఓ ర‌క‌మైన ఇమేజ్ క‌ల్పించార‌ని, ఇందులో మీడియా కీల‌క పాత్ర పోషించార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ అధికారంలోకి రాగానే మొట్ట‌మొద‌ట అరెస్ట్ చేయించింది త‌న‌నేన‌ని చింత‌మ‌నేని గుర్తు చేశారు. త‌న‌పై కేసుల‌కు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న తేల్చిచెప్పారు. రాజ‌కీయంగా త‌న‌ను అణ‌గ‌దొక్కేందుకు చేసిన ఎత్తుగ‌డ అని చింత‌మ‌నేని ఆరోపించారు. టీడీపీ జెండాలు మోస్తే ఇదే గ‌తి ప‌డుతుంద‌నే హెచ్చ‌రిక చేసేందుకు త‌న అరెస్టు ఉదంతం చూపించార‌ని అన్నారు.

ఎమ్మెల్యే కాక‌ముందు నుంచే త‌నకు జైలుకు వెళ్లిన అనుభ‌వాలు ఉన్నాయ‌ని చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌ చెప్పారు. అయితే, ఎమ్మెల్యే కాక‌ముందే వాటిని కొట్టివేశార‌ని గుర్తు చేశారు. జ‌నాల్లో ఆద‌ర‌ణ ఉన్న‌వారు జైలుకు వెళితే ఇబ్బంది పడ‌తార‌న్న‌ది నిజ‌మే అయిన‌ప్ప‌టికీ త‌న జీవితంలో దీన్ని అనుభ‌వించక త‌ప్ప‌లేద‌న్నారు. త‌న‌ను ఓట‌మి పాలు చేయ‌డంలో త‌న వ్య‌క్తిత్వం కంటే త‌న‌ను మీడియా వాడుకున్న తీరు వ‌ల్ల జ‌రిగింద‌న్నారు.

ఎస్సీల‌ను తొక్కేసేవారు అని త‌న‌పై ముద్ర వేశార‌ని అయితే, త‌న‌పై అది ఆరోప‌ణ మాత్ర‌మేన‌ని తెలిపారు. పోలీసుల‌ను సైతం బెదిరించిన‌ట్లు చింత‌మ‌నేని ప‌రోక్షంగా చెప్పారు. త‌న ప‌ట్ల ప‌రుషంగా ప్ర‌వ‌ర్తించిన పోలీసుల‌ను వ‌దిలేది లేద‌న్న‌ట్లు వారికి హెచ్చ‌రించిన‌ట్లు తెలిపారు. రౌడీషీట్ అన్న‌ది త‌న‌కు ఓ మెడల్ వంటిద‌ని పేర్కొన్న చింత‌మ‌నేని వాటిని తొల‌గించాల‌ని తమ ప్ర‌భుత్వంలో సైతం ఎవ‌రినీ కోర‌లేద‌ని వ్యాఖ్యానించ‌డం కొస‌మెరుపు.