Begin typing your search above and press return to search.

ప్రధాని అవ్వడానికి అర్హతలు అవేనా?

By:  Tupaki Desk   |   19 Oct 2016 4:15 AM GMT
ప్రధాని అవ్వడానికి అర్హతలు అవేనా?
X
వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ మీడియా ముందుండే సమాజ్ వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని అవ్వడానికి కావాల్సిన అర్హతలు ఏమిటో అందరికీ తెలిసినా ప్రస్తుత ప్రధాని మోడీపై వెటకారమాడారు. ప్రధానికి ఉండాల్సిన అర్హతలు తనకు కూడా ఉన్నాయని చెబుతూ, ఆ అర్హతల్లో టీ తయారుచేయడాన్ని, సూటూ బూటూ వేసుకోవడాన్ని ప్రస్థావించారు. ఈ స్థాయిలో ప్రధాని కావడానికి తనకూ అర్హతలున్నాయని చెబుతున్న ఆజం ఖాన్... స్థానికంగా యూపీలోని సహరణ్ పూర్ లో జరిగిన ఈ-రిక్షాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తనలోని వెటకారాన్ని బయటకు తీసిన ఆజం ఖాన్... "ప్రధానికి ఉండాల్సిన అర్హతలన్నీ నాకున్నాయి.. నేనూ టీ తయారు చేయగలను.. డ్రమ్స్ వాయించగలను.. సూటు - బూటు వేసుకుని మంచిగా డ్రెస్ చేసుకోగలను.. వంట బాగా చేయగలను.. అలాగే అందంగానూ ఉంటాను.. అంతేకాదు ప్రధాని అయిన ఆరు నెలల్లోనే దేశంలోని 130 కోట్ల ప్రజలందరికీ వారి వారి బ్యాంక్ ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ. 20 లక్షలు జమ చేస్తాను" అని అన్నారు. ప్రధాని కావాలంటె ఈ అర్హతలు ఉంటే చాలా... ఆజం ఖన్ వ్యంగం అలా ఉంది మరి. అయితే నల్లధనం వెలికితీసి ఒక్కొక్కరి అకౌంట్లలో రూ.15 లక్షలు వేస్తానని లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మోడీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎవ్వరూ ఇవ్వని హామీలివ్వగలిగితే చాలు ప్రధాని పదవికి అర్హత సాధించినట్లే అనేది అజం ఖాన్ మాటలో అర్ధంగా అనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆజం ఖాన్ కి ఈ రోజు కొత్తేమీ కాదు, గతంలో తాజ్ మహల్ ను కూల్చి శివాలయం కట్టాలని ఒక సందర్భంలో వ్యాఖ్యానించగా... రాష్ట్రపతి భవన్, పార్లమెంటులను కూడా కూల్చేసి మరలా కట్టాలని, అవి బానిసత్వానికి ప్రతీకలని ప్రకటించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/