Begin typing your search above and press return to search.

సీబీఐ జేడీ మ‌ళ్లీ తూచ్ అనేశారే!

By:  Tupaki Desk   |   12 March 2019 5:23 PM GMT
సీబీఐ జేడీ మ‌ళ్లీ తూచ్ అనేశారే!
X
వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై న‌మోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచార‌ణాధికారిగా సీబీఐ మాజీ జేడీ వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ ప‌రిస్థితి ఇప్పుడు అగ‌మ్య గోచ‌రంగా త‌యారైంద‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌హారాష్ట్ర కేడ‌ర్ ఐపీఎస్ అధికారిగా ఉన్న ల‌క్ష్మీనారాయ‌ణ... సీబీఐలో ప‌నిచేసిన సంద‌ర్భంగా ఏపీ జేడీగా వ్య‌వ‌హ‌రించారు. ఆ స‌మ‌యంలోనే జ‌గ‌న్‌ పై కాంగ్రెస్‌ - టీడీపీలు జ‌ట్టు క‌ట్టు కట్టి సీబీఐ విచార‌ణ జ‌రిగేలా వ్య‌వ‌హ‌రించాయ‌న్న వాద‌న నాడు వినిపించింది. టీడీపీలో అత్యంత స‌న్నిహితంగానే మెల‌గిన ల‌క్ష్మీనారాయ‌ణ‌... నాటి కేసు వివ‌రాల‌ను టీడీపీ అనుకూల మీడియాకు లీక్ చేసి పెద్ద కుట్ర‌కే పాల్ప‌డ్డార‌ని కూడా ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. అయితే ఆ త‌ర్వాత ఆయ‌న బ‌దిలీ కావ‌డం, ఆ వెంట‌నే త‌న ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వ‌చ్చేస్తున్నానంటూ ప్ర‌క‌టించ‌డం జ‌రిగిపోయింది. ఈ క్ర‌మంలో ల‌క్ష్మీనారాయ‌ణ టీడీపీలోనే చేర‌తార‌ని ప్ర‌చారం సాగినా... ఆయ‌న దానిని ఖండించారు. సొంతంగానే పార్టీ పెట్టుకుంటాన‌ని - ఇత‌ర పార్టీల్లో చేరేది లేద‌ని కూడా తేల్చేశారు.

అయితే ఇప్పుడు ఎన్నిక‌ల న‌గారా మోగిన నేప‌థ్యంలో మ‌రోమారు ల‌క్ష్మీనారాయ‌ణ‌పై ఈ త‌ర‌హా పుకార్లే ఇప్పుడు షికారు చేస్తున్నాయి. ల‌క్ష్మీనారాయ‌ణ నేడో - రేపో టీడీపీలో చేరిపోతున్నార‌ని - ఆయ‌న‌కు విశాఖ జిల్లాలోని భీమిలి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాన్ని కేటాయించేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ని కూడా నేటి ఉద‌యం నుంచి పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగింది. ఈ ప్ర‌చార‌మంతా టీడీపీ అనుకూల మీడియాలోనే కొన‌సాగింది. దీనిపై అప్ప‌టికప్పుడు రంగంలోకి దిగిపోయిన కాంగ్రెస్‌ - వైసీపీలు... ల‌క్ష్మీనారాయ‌ణ ముసుగు తొల‌గిపోయింద‌ని - టీడీపీలో చేరుతున్న ఆయ‌న వైఖ‌రి చూస్తుంటే... నాడు జ‌గ‌న్ కేసుల‌పై ఏ తీరిన విచార‌ణ నిర్వ‌హించింద‌న్న విష‌యం కూడా తేలిపోయింద‌ని విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టాయి.

దీంతో సాయంత్రానికల్లా బ‌య‌ట‌కు వ‌చ్చేసిన ల‌క్ష్మీనారాయ‌ణ తాను టీడీపీలో చేర‌డం లేద‌ని ప్ర‌క‌టించేశారు. తాను టీడీపీలో చేరుతున్న‌ట్లుగా వ‌చ్చిన వార్త‌ల్లో వాస్త‌వం లేద‌ని కూడా ఆయ‌న తేల్చేశారు. అంతేకాకుండా రాజ‌కీయాల‌కు సంబంధించి తాను ఇంకా ఓ స్ప‌ష్ట‌మైన నిర్ణ‌యాన్నే తీసుకోలేద‌ని చెప్పిన ల‌క్ష్మీనారాయ‌ణ‌... టీడీపీ అనుకూల మీడియాలో సాగుతున్న‌దంతా ఒట్టి పుకార్లేన‌ని కూడా తేల్చి పారేశారు. మొత్తంగా విప‌క్షాల‌న్నీ ఒక్కుమ్ముడిగా విరుచుకుప‌డ‌టంతో నేరుగా ల‌క్ష్మీనారాయ‌ణే మీడియా ముందుకు వ‌చ్చి వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింద‌న్న వాద‌న వినిపిస్తోంది.