Begin typing your search above and press return to search.

పెళ్లి చేస్తున్న పేరెంట్స్ పై కంప్లైంట్.. తర్వాతేమైందంటే?

By:  Tupaki Desk   |   10 July 2020 9:45 AM IST
పెళ్లి చేస్తున్న పేరెంట్స్ పై కంప్లైంట్.. తర్వాతేమైందంటే?
X
ఇటీవలే పదోతరగతి పూర్తి చేసిన ఒక బాలికకు ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేసే ప్రయత్నం చేశారు. ఒక సంబంధాన్ని ఖాయం చేసి.. పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు కూడా. ఈ క్రమంలో తనకు ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారని.. తనకు చదువుకోవాలని ఉందంటూ సదరు బాలిక తల్లిదండ్రులపై కంప్లైంట్ చేసింది. ఈ ఆసక్తికర ఘటన షాద్ నగర్ లో చోటు చేసుకుంది. పేరెంట్స్ మీద కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు ఎలా రియాక్టు అయ్యారు? ప్రస్తుతం ఆ అమ్మాయి ఎక్కడ ఉందన్న విషయంలోకి వెళితే..

షాద్ నగర్ లోని జానంపూటకు చెందిన పదహారు సంవత్సరాల బాలిక ఇటీవల పదో తరగతి పాస్ అయ్యింది. బాగా చదువుకోవాలన్నది ఆ బాలిక ఆలోచన. అందుకు భిన్నంగా ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేయాలని భావించారు. ఇందులో భాగంగా ఒక సంబంధాన్ని చూడటమే కాదు.. సదరు వ్యక్తితో ఎంగేజ్ మెంట్ చేసేశారు. ఈ నెలాఖరున పెళ్లికి సంబంధించిన పనులు సాగుతున్నాయి.

ఇలాంటి సమయంలో తన తల్లిదండ్రులు చేస్తున్న పెళ్లి తనకే మాత్రం ఇష్టం లేదని.. తాను చదువుకుంటానంటూ బంధువులకు.. స్నేహితులకు చెప్పుకొంది. వారిచ్చిన సలహాతో హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి.. తనకు జరుగుతున్న అన్యాయం గురించి చెప్పుకుంది. రంగంలోకి దిగిన అధికారులు.. సదరు బాలిక ఇంటికి వెళ్లి.. పేరెంట్స్ కు కౌన్సెలింగ్ ఇచ్చారు. సదరు బాలికతో మాట్లాడారు.

ఆమె ఇష్టానికి తగ్గట్లుగా హైదరాబాద్ లోని ప్రభుత్వ హాస్టల్ లో ఉంటూ ఇంటర్ చదువుకునేందుకు వీలుగా ఆమెను తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే.. బాలిక తల్లిదండ్రుల వాదన వేరుగా ఉంది. పదోతరగతి సర్టిఫికేట్ ప్రకారం తమ అమ్మాయికి పద్దెనిమిదేళ్లు నిండినట్లు చెప్పినా.. అధికారులు మాత్రం అంగీకరించలేదు. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి జరగటం సరికాదంటూ.. ఆమె మాటకు విలువనిస్తూ ఆమెను హైదరాబాద్ కు తరలించారు.