Begin typing your search above and press return to search.

నీట్ లో ఫస్ట్ ర్యాంకర్ హైదరాబాదీ.. టాప్ 100లో తెలుగు రాష్ట్రాల స్థానమేంటి?

By:  Tupaki Desk   |   2 Nov 2021 3:59 AM GMT
నీట్ లో ఫస్ట్ ర్యాంకర్ హైదరాబాదీ.. టాప్ 100లో తెలుగు రాష్ట్రాల స్థానమేంటి?
X
సెప్టెంబరు 12న దేశ వ్యాప్తంగా జరిగిన జాతీయ వైద్య విద్య అర్హత ప్రవేశ పరీక్ష పొట్టిగా చెప్పాలంటే నీట్ 2021 ఫలితాలు సోమవారం రాత్రి విడుదలయ్యాయి. షెడ్యూల్ ప్రకారం పరీక్ష జరిగిన నెల రోజులకు ఫలితాలు వెల్లడి కావాల్సి ఉన్నా.. మహారాష్ట్ర.. గుజరాత్.. రాజస్థాన్ లలో క్వశ్చన్ పేపర్ ముందుగా బయటకు వచ్చేసిందన్న ఆరోపణలు.. అనంతరం సీబీఐ విచారణ.. కోర్టు కేసులతో ఆలస్యమైంది. ఫలితాల వెల్లడికి శుక్రవారమే కోర్టు ఓకే చెప్పిన క్రమంలో సోమవారం రాత్రి ఫలితాల్ని విడుదల చేశారు. దేశం మొత్తమ్మీదా 15.44 లక్షలమంది పరీక్ష రాస్తే.. 56.34 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. తెలుగు వారంతా ఆనందించే విషయం ఏమంటే.. ఈ ఫలితాల్లో జాతీయస్థాయి మొదటి ర్యాంకు హైదరాబాద్ కుర్రోడి సొంతమైంది.

మృణాల్ కుటోరి అనే విద్యార్థి నిట్ 2021 ఫస్ట్ ర్యాంకర్ గా నిలిచారు. అంతేకాదు.. మొత్తం పరీక్ష రాసిన వారిలో ముగ్గురు నూటికి నూరు శాతం మార్కుల్ని సొంతం చేసుకోవటం విశేషంగా చెప్పాలి. రెండో స్థానంలో ఢిల్లీకి చెందిన తన్మయ్ గుప్తా.. మూడో స్థానంలో మహారాష్ట్రకు చెందిన కార్తీక జి నాయర్ నిలిచారు. ఐదో ర్యాంక్ కు పన్నెండు మంది విద్యార్థులు పోటీ పడ్డారు. వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కందవల్లి శశాంక్ కూడా ఉన్నారు. తొలి 10 ర్యాంకుల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ర్యాంకులు సాధిస్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే.. ఇద్దరు నిలిచారు. వారిద్దరూ ఐదో ర్యాంకులో నిలవటం విశేషం.

మొత్తంగా మొదటి వంద ర్యాంకుల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు మొత్తం 14 మంది ఉన్నారు. వీరిలో తెలంగాణకు చెందిన తొమ్మిది మంది ఉంటే.. ఏపీకి చెందిన ఐదుగురు విద్యార్థులు ఉన్నారు. గత ఏడాది మాదిరే ఈ ఏడాదిలోనూ నీట్ ఫలితాల్లో అబ్బాయిల హవానే కనిపించింది. మొదటి ర్యాంకర్ గా నిలిచిన మృణాల్ కుటోరి మాట్లాడుతూ.. తాను ఆర్మీ వైద్యుడిగా సేవలు అందించటమే తన లక్ష్యంగా చెప్పారు. ఇష్టపడి చదివితే ర్యాంకును సొంతం చేసుకోవటం కష్టం కాదన్నాడు.

సినిమాలతో పొందిన స్ఫూర్తితో.. సైన్యంలో వైద్యుడిగా పని చేయాలని భావించానని.. ఆ ఆసక్తితోనే చదివినట్లు చెప్పారు. కేరళ నుంచి వచ్చిన మృణాల్ కుటుంబం హైదరాబాద్ లో స్థిరపడింది. తల్లిదండ్రులు ఇద్దరు హెచ్ఆర్ విభాగంలో పని చేస్తుంటారు. రాత్రిపగలు తేడా లేకుండా చదవలేదని.. ఎప్పుడు చదవాలనిపిస్తే అప్పుడే చదివేవాడినని.. ఆ స్వేచ్ఛ తన తల్లిదండ్రులు తనకు ఇచ్చినట్లు చెప్పాడు. ఆన్ లైన్ శిక్షణ కష్టాల్ని దాటి ఢిల్లీ ఎయిమ్స్ లక్ష్యంతో తాను పరీక్ష రాశానని.. అనుకున్నది సాధించినట్లు చెప్పారు.