Begin typing your search above and press return to search.

రాత్రి 9 గంట‌ల‌కే ఇంటికెళ్లిన హైదరాబాద్‌..!

By:  Tupaki Desk   |   21 April 2021 7:30 AM GMT
రాత్రి 9 గంట‌ల‌కే ఇంటికెళ్లిన హైదరాబాద్‌..!
X
స‌మ‌యం రాత్రి 9 అవుతుందంటే.. చార్మినార్ మ‌దీనా సెంట‌ర్ షాపింగ్ తో క‌ళ‌క‌ళ‌లాడుతూ ఉంటుంది.. ఐమాక్స్ నుంచి ఆడియ‌న్స్ బ‌య‌ట‌కొస్తుంటారు.. ట్యాంక్ బండ్ మీద ఇంకా సంద‌డి కొన‌సాగుతూ ఉంటుంది. ఖైర‌తాబాద్ సిగ్న‌ల్స్ ద‌గ్గ‌ర.. వాహ‌న సైన్యం మోహ‌రించి ఉంటుంది. మెట్రో కూత‌పెడుతుంటే.. రోడ్ల‌న్నీ ఫుల్ ప్యాక్ అయిపోయి హార‌న్ మోగిస్తుంటాయి!

కానీ.. పై ఫొటో చూడండి. భాగ్య‌న‌గ‌రం రాత్రి 9 లోపే ఇంటికెళ్లిపోయింది! బ‌ల‌వంత‌పు నిద్ర‌కు ఉప‌క్ర‌మించింది. క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండ‌డంతో.. ప్ర‌భుత్వం నైట్ క‌ర్ఫ్యూను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. రాత్రి 9 నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు ఈ క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉంటుంద‌ని ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే క‌రోనా విజృంభ‌ణ‌తో బ‌య‌ట‌కు రావాలంటేనే జ‌నం భ‌య‌ప‌డుతున్నారు. అలాంటి ప్ర‌భుత్వం క‌ర్ఫ్యూ కూడా విధించడంతో.. హైద‌రాబాద్ మొత్తం ఇంటికే ప‌రిమితం అయిపోయింది!

ప్ర‌భుత్వ ఆదేశాల‌ను సీరియ‌స్ గా అమ‌లు చేస్తున్న పోలీసులు.. నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. వైద్య సేవ‌లు, ఆహారం కోసం బ‌య‌ట‌కు వ‌చ్చే వారికి, మీడియా ప్ర‌తినిధుల‌కు మిన‌హా.. మిగిలిన వారు రోడ్డెక్కితే వెయ్యి రూపాయ‌లు జ‌రిమానా విధిస్తున్నారు.

ఈ పరిస్థితి చూస్తూ.. లాక్ డౌన్ రోజులను గుర్తు చేసుకుంటున్నారు నగర జనాలు. లాక్ డౌన్ కొనసాగినన్ని రోజులు ఇంటికే పరిమితం అయిన సంగతి తెలిసిందే. చేయడానికి పనిలేక, తినడానికి తిండిలేక ఎంతో మంది అల్లాడిపోయారు. అప్పుడు కూడా మొదట ఒకటీ రెండు రోజులు అని చెప్పి.. కంటిన్యూ లాక్ డౌన్ విధించారు. మరోసారి అలాంటి పరిస్థితి వస్తుందా? అని భయపడుతున్నారు జనం.

అయితే.. వాస్తవ పరిస్థితిని జనం కూడా గుర్తిస్తున్నారు కాబట్టి.. ప్రభుత్వం, పోలీసులు గట్టిగా చెప్పాల్సిన పనిలేకుండానే.. ఇంట్లో ఉండేదుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అత్యవసరం అయితేనే బయటకు వస్తున్నారు. పోలీసులు రాత్రంతా రోడ్ల‌పై విధులు నిర్వ‌ర్తిస్తున్నారు.