Begin typing your search above and press return to search.

ఇంట్లో నుండి బయటకి వచ్చారో..సచ్చారే !

By:  Tupaki Desk   |   22 April 2020 1:20 PM IST
ఇంట్లో నుండి బయటకి వచ్చారో..సచ్చారే !
X
కరోనా లాక్ డౌన్ వున్నా కొంతమంది యథేచ్చగా రోడ్లమీదకు వచ్చి తిరుగుతున్నారు. దీనిపై పోలీసులు సీరియస్ అవుతున్నారు. పోలీసులు - ప్రభుత్వాలు ఇళ్ల నుండి బయటకి రాకండి అని ఎంత మొత్తుకొని చెప్తున్నా కూడా కొందరి తీరు మారడంలేదు. అవసరం లేకున్నా కూడా రోడ్డు మీదకి వస్తున్నారు. దారిలో పోలీసులు ఆపితే ..పొంతనలేని మాటలు చెబుతున్నారు. దీనిపై సోమవారం వరకు మామూలుగా వ్యవహరించిన పోలీసులు.. మంగళవారం నుండి లాఠీలకు పని చెప్పడం మొదలు పెట్టారు. నిర్ణయించిన పరిధి దాటి బయటకి వస్తే ..కేసులతో పాటు వీపు మోత మోగిస్తున్నారు. ఫలితంగా కేసులు - వాహనాల స్వాధీనం భారీగా పెరిగాయి.

లాక్‌ డౌన్‌ ను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని నిర్ణయించిన పోలీసు విభాగం మంగళవారం నుండి ఆ దిశగా అడుగులు ముందుకు వేసింది. అవసరం లేకున్నా రోడ్ల పైకి వచ్చేవారిపై కేసుల కొరడా ఝుళిపించింది. మంగళవారం ఏసీపీ - డీసీపీ స్థాయి అధికారులు రోడ్ల పైకి వచ్చి చెక్‌ పోస్టుల వద్ద పోలీసుల పని తీరును పరిశీలించారు. నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 133 చెక్‌ పాయింట్ల వద్ద చర్యలు కట్టుదిట్టం చేశారు. లాక్‌ డౌన్‌ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం కొన్ని ఉపశమనాలు ఇచ్చింది. ఉదయం పూట ఆంక్షల్ని సడలిస్తూ ప్రతి నగరవాసి నిత్యావసర వస్తువులు - ఔషధాలు వంటివి కొనుగోలు చేయడానికి అవకాశం కల్పించింది. అయితే , దీన్ని అనేకమంది దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాంటి వారిని పట్టుకోవడానికి మంగళవారం నుండి పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.

ఓపక్క చెక్‌ పోస్టులు - మరోపక్క పికెట్ల వద్ద వాహనచోదకుల్ని ఆపి.. ఆకారణంగా బయటకు వచ్చిన వారి నుంచి వాహనాలు స్వాధీనం చేసుకుంటున్నారు. లాక్‌ డౌన్‌ గత నెల 23న అమలులోకి రాగా.. అప్పటి నుంచి సోమవారం వరకు హైదరాబాద్‌ పోలీసులు మొత్తం వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో అత్యధికం బైక్స్ కావడంతో యువకులే అకారణంగా రోడ్ల పైకి వస్తున్నట్లు నిర్ధారణ అవుతోందని చెప్తున్నారు. లాక్‌ డౌన్‌ ప్రారంభమైన గత నెల 23 నుంచి సోమవారం వరకు పోలీసులు మొత్తం 71,625 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల రోజుల వ్యవధిలో అత్యధికంగా ఈ నెల 15న 2745 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం దీన్ని మించి 3634 వాహనాలు సీజ్‌ చేశారు. కాగా, నిత్యావసరాలు - ఔషధాల కోసం ఓ వ్యక్తి తన నివాసం నుంచి గరిష్టంగా మూడు కిలోమీటర్ల పరిధిలో మాత్రమే సంచరించడానికి అనుమతి ఇచ్చారు.

అలాగే ఇకపై ఎవరు ఏ పని మీద బయటకి వచ్చినా కూడా గుర్తింపు కార్డు కచ్చితంగా తీసుకురావాలని రూల్ పెట్టారు. దీనితో ఈ నిబంధన ఉల్లంఘించిన దాదాపు 9 వేల మందిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. లాక్‌ డౌన్‌ ఉల్లంఘనలకు పాల్పడిన వాహన చోదకులకు పోలీసులు మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్‌ 179 కింద జరిమానా విధిస్తున్నారు. దీని ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారికి రూ.600 జరిమానా పడుతోంది. అయితే తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై మాత్రం ఐపీసీలోని సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. వీరిపై కోర్టులో నేరం నిరూపణ అయితే గరిష్టంగా రెండేళ్ల వరకు శిక్ష పడేందుకు ఆస్కారం ఉంది. ఇకపోతే తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 928 మందికి కరోనా సోకగా ...23 మంది మరణించారు.