Begin typing your search above and press return to search.

తెలంగాణ పోలీస్ చిట్టి సీన్లోకి వ‌చ్చేస్తోంది

By:  Tupaki Desk   |   6 July 2017 11:20 AM IST
తెలంగాణ పోలీస్ చిట్టి సీన్లోకి వ‌చ్చేస్తోంది
X
అప్పుడెప్పుడో వ‌చ్చిన రోబో సినిమా గుర్తుంది క‌దా? అందులో చిట్టి అనే రోబో చేసే విన్యాసాలు అన్నిఇన్ని కావు. స‌రిగ్గా అలానే చేస్తుంద‌ని చెప్పటం లేదు కానీ.. దైనందిక జీవితాల్లో అవ‌స‌ర‌మైన ప‌నుల్ని రోబోలు చేసే రోజులు వ‌చ్చేశాయి. త‌ర‌చూ మీడియాలో ఆ దేశంలో రోబోల‌తో ఆ ప‌ని చేయించారు.. ఈ ప‌ని చేయించారంటూ వార్త‌లు వింటూనే ఉంటాం కానీ.. మ‌న దేశంలో రోబోల‌తో ప‌ని చేయించే ప్ర‌క్రియ పెద్ద‌గా రాలేద‌నే చెప్పాలి.

తాజాగా తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు వినూత్న కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. ప్ర‌పంచంలోనే అరుదైన పోలీస్ రోబోను హైద‌రాబాద్ రోడ్ల మీద‌కు తీసుకొచ్చేస్తోంది. రోబోల త‌యారీలో కొత్త ఒర‌వ‌డిని సృష్టిస్తోన్న హెచ్ బోట్స్ రోబోటిక్స్ వ్య‌వ‌స్థాప‌కులు రెండు నెల‌లుగా శ్ర‌మించి తెలంగాణ పోలీస్ రోబో డిజైన్‌కు తుది రూపును ఇచ్చారు.

ఈ రోబో కేవ‌లం మాట‌ల‌కే ప‌రిమితం కాకుండా.. ఈ ఏడాది చివ‌రి రోజైన డిసెంబ‌రు 31న జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్ష‌న్లో విధుల‌ను నిర్వ‌ర్తించేలా చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం దుబాయ్ లో మాత్ర‌మే రోబో పోలీస్ ఉంది. ప్ర‌పంచంలోనే రెండో రోబో పోలీస్‌ను హైద‌రాబాద్ లో ఏర్పాటు చేయ‌నున్నారు. సామాజిక అవ‌స‌రాల కోసం రోబోల‌ను త‌యారు చేయాల‌న్న‌దే త‌మ ల‌క్ష్య‌మ‌ని హెచ్ బోట్స్ రోబోటిక్ సీఈవో కిష‌న్ చెబుతున్నారు. రానున్న ఏడేళ్ల వ్య‌వ‌ధిలో దేశ వ్యాప్తంగా 40 మేక‌ర్స్ స్పేస్ కేంద్రాల్ని ఏర్పాటు చేయ‌ట‌మే త‌మ లక్ష్యంగా చెప్పుకొచ్చారు.

ఇంత‌కూ డిసెంబ‌రు 31న జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ద‌గ్గ‌ర ఏర్పాటు చేసే పోలీస్ రోబో ఏం చేస్తుంద‌న్న విష‌యానికి వ‌స్తే.. రోడ్డు మీద రూల్స్ ను బ్రేక్ చేస్తున్న వారికి సంబంధించిన ఫోటోలు.. వీడియోలను పోలీస్ రోబో మెయిన్ స‌ర్వ‌ర్‌కు పంపిస్తుంది. అదేస‌మ‌యంలో ఎవ‌రైనా కంప్లైంట్లు ఇచ్చిన తీసుకుంటుంది. తాను విధినిర్వ‌హ‌ణ‌లో ఉన్న ప‌రిస‌రాల్లో బాంబులు.. అనుమానాస్ప‌ద వ‌స్తువులు ఉంటే కూడా గుర్తిస్తుంది. కొస‌మెరుపు ఏమిటంటే.. ఈ రోబోకు పోలీస్ యూనిఫాం వేయ‌నున్నారు. సో.. రియ‌ల్ 'చిట్టి' హైద‌రాబాద్ రోడ్ల మీద‌కు వ‌చ్చేస్తున్నాడ‌న్న మాట‌.