Begin typing your search above and press return to search.

దేశంలో హైదరాబాద్ రికార్డు.. కరోనాను జయించిన రోజుల శిశువు

By:  Tupaki Desk   |   24 May 2021 10:00 AM IST
దేశంలో హైదరాబాద్ రికార్డు.. కరోనాను జయించిన రోజుల శిశువు
X
దేశంలో మరెక్కడా లేని విధంగా హైదరాబాద్ కు చెందిన నవజాత శిశువు అరుదైనరికార్డును తన సొంతం చేసుకుంది. నెలలు నిండకుండానే పుట్టి.. కరోనా బారిన పడటమే కాదు..మహమ్మారిని జయించిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ క్రెడిట్ లో కొండాపూర్ కిమ్స్ వైద్యులకు సైతం సమాన భాగస్వామ్యం ఇవ్వాల్సిందే. హైదరాబాద్ కు చెందిన 28 వారాల గర్భణీ కరోనా సోకింది. తీవ్రమైన లక్షణాలతో బాద పడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకొచ్చారు.

ఆక్సిజన్ లెవల్స్ పడిపోయి వెంటిలేటర్ మీద చికిత్స పొందుతూ ఏప్రిల్ 17న నెలలు నిండని.. కిలో బరువుతో నవజాత శిశువు జన్మను ఇచ్చింది. పుట్టిన వెంటనే శిశువుకు కోవిడ్ టెస్టు చేయగా.. తొలుత నెగెటివ్ వచ్చింది. వారం తర్వాత పాజిటివ్ గా రావటమే కాదు.. శ్వాస తీసుకోవటం కష్టమై.. వెంటిలేటర్ అవసరమైంది. ఈ నేపథ్యంలో వైద్యుల టీం ఒకటి కొవిడ్ ఐసోలేషన్ వార్డుకు నవజాత శిశువును తరలించి.. ఇంట్రవీనస్ యాంటీ బయాటిక్స్ ఇస్తూ ఆధునిక పద్దతిలో చికిత్స చేశారు. వారి కష్టం ఫలించి.. నవజాత శిశువు కరోనా బారి నుంచి బయటపడింది.

మరోసారి పరీక్ష నిర్వహించి.. కరోనా నెగటివ్ రావటంతో ప్రత్యేకమైన వైద్య సదుపాయాలు కల్పించి చికిత్స చేశారు. దాదాపు నెల పాటు ఆసుపత్రిలోనే ఉన్నారు. శిశువు బరువు కేజీన్నరకు రావటమే కాదు.. తల్లి కూడా కరోనా బారి నుంచి బయటపడి కోలుకోవటంతో.. డిశ్చార్జి చేశారు. ఇంత వయసు తక్కువ నవజాత శిశువు కరోనాను జయించిన ఘటన దేశంలో ఇదే తొలిసారి అని చెబుతున్నారు. హైదరాబాద్ డాక్టర్లు హేట్సాఫ్ చెప్పాల్సిందే.