Begin typing your search above and press return to search.

తాగి నడిపినోళ్లకు చుక్కలు కనిపించే ‘సింపుల్’ శిక్ష

By:  Tupaki Desk   |   7 April 2016 5:30 PM GMT
తాగి నడిపినోళ్లకు చుక్కలు కనిపించే ‘సింపుల్’ శిక్ష
X
నిర్లక్ష్యంగా వాహనం నడిపే వారి కారణంగా నిత్యం అమాయకులు ఎందరో బలి అవుతుంటారు. అలాంటి వారికి చెక్ చెప్పటంతో పాటు.. వారికి బుద్ధి వచ్చేలా చేసేందుకు హైదరాబాద్ పోలీసులు ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. కోర్టులు సైతం జరిమానా విధించి వదిలేయటం కాకుండా.. వారిలో బాధ్యత పెంచే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా వారికి వెరైటీ శిక్షల్ని విధిస్తోంది.

వినేందుకు సింఫుల్ గా అనిపించినా.. సదరు శిక్షను అనుభవించే సమయంలో మాత్రం చుక్కలు కనిపిస్తున్న పరిస్థితి. తాజాగా తాగి డ్రైవ్ చేస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని.. న్యాయస్థానం ఎదుట హాజరు పరిచారు. వారికి.. ట్రాఫిక్ పోలీసులు చేసే పనిని శిక్షగా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ట్రాఫిక్ పోలీసులు చేసే పనేగా.. చాలా సింఫల్ అనుకున్న వారికి.. సదరు శిక్షను అమలు చేసే విషయంలో చుక్కలు కనిపించాయి.

ఎందుకంటే.. మండే ఎండల్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ మాదిరి ప్రధాన రోడ్ల మీద ఉండి రోడ్డు సిగ్నల్స్.. కానిస్టేబుల్ చెప్పినట్లుగా బాధ్యతలు నిర్వర్తించాల్సి వచ్చింది. నిత్యం చూసే పని అయినప్పటికీ.. అదే పనిని తాము చేయాల్సి వచ్చేసరికి వారందరికి చెమటలు పట్టి చేతులు వణికిపోయాయి. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉద్యోగం అంటే అంత తేలిక కాదని వారికి అర్థమైందని చెబుతున్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మొత్తం 31 మందికి శిక్ష విధించగా.. శిక్ష అమలు చేసే సమయంలో కేవలం రెండు గంటల వ్యవధిలోనే చేతులు.. కాళ్లు నొప్పులు పెడుతున్నాయంటూ పలువురు నీరసపడటం గమనార్హం. పూటుగా తాగేసి.. రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో లైట్ గా వ్యవహరించే వారికి తాజా శిక్ష వారిని బెంబేలెత్తించిందని చెప్పక తప్పదు.