Begin typing your search above and press return to search.

రియల్ రంగంలో హైదరాబాద్ ఎంత తోపో చెప్పే అంకెలు

By:  Tupaki Desk   |   28 April 2021 3:00 PM IST
రియల్ రంగంలో హైదరాబాద్ ఎంత తోపో చెప్పే అంకెలు
X
కరోనా కారణంగా యావత్ దేశం తీవ్రమైన ఇబ్బందుల్లో చిక్కుకుంది. గత ఏడాది విధించిన లాక్ డౌన్ తో పాటు కరోనా చిక్కులు పలు రంగాల మీద ప్రభావాన్ని చూపాయి. అందుకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మినహాయింపు కాదు. కాకుంటే.. లాక్ డౌన్ అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. దేశంలోని చాలా తక్కువ ప్రధాన నగరాల్లోనే ఇలాంటి పరిస్థితి ఉందని చెప్పాలి.

లాక్ డౌన్ తర్వాత నెలకొన్న పరిణామాలతో రియల్ రంగం పుంజుకోవటమేకాదు.. హైదరాబాద్ మహానగరానికి పెట్టుబడుల వరద పారింది. గత ఏడాది మొదటి క్యూ (జనవరి - మార్చి)తో పోల్చినప్పుడు ఈ ఏడాది మొదటి క్యూలో రియల్ రంగంలోకి వచ్చిన పెట్టబడులు భారీగా ఉన్నట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాది క్యూ1తో పోలిస్తే.. ఈ ఏడాది క్యూ1 ఏకంగా 21 శాతం వృద్ధిని నమోదుచేసింది. ఇందులో ఆఫీస్ స్పేస్ అగ్రస్థానంలో నిలిచింది.

దేశ వ్యాప్తంగా ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 922 మిలియన్ డాలర్ల సంస్థాగత పెట్టుబడులు రాగా.. అందులో 41 శాతం హైదరాబాద్ రియాల్టీ రంగానికి రావటం గమనార్హం. అంటే.. దగ్గర దగ్గర 384 మిలియన్ డార్లు. గత ఏడాది ఇదే కాలానికి వచ్చిన పెట్టుబడులు కేవలం వంద మిలియన్ డాలర్లు మాత్రమే. ఈ ఏడాది మొదటి క్యూకు హైదరాబాద్ మహానగరానికి వచ్చిన పెట్టుబడులతో పోలిస్తే.. సగం పెట్టుబడులు మాత్రమే దేశ ఆర్థిక రాజధాని ముంబయికి రావటం గమనార్హం.

ముంబయికి 193 మిలియన్ డాలర్లు పెట్టుబడులుగా రాగా.. ఢిల్లీకి 107 మిలియన్ డాలర్లు.. ఫుణేకు ఏడు మిలియన్ డాలర్లు.. దేశంలోని మిగిలిన అన్ని నగరాలు కలిపి 231 మిలియన్ డాలర్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. వచ్చిన పెట్టుబడుల్లో అత్యధికం ఆఫీస్ స్పేస్ విభాగంలోనే. ఇదంతా చూసినప్పుడు.. తాజా కరోనా కారణంగా రియల్ రంగం నెమ్మదించినా.. రానున్న రోజుల్లో మరింత దూకుడును ప్రదర్శించే వీలుందన్న మాట వినిపిస్తోంది.