Begin typing your search above and press return to search.

ఓఆర్ఆర్ మీద జెట్ స్పీడ్ తో దూసుకెళ్లే అలవాటుందా.. మీకోసమే?

By:  Tupaki Desk   |   30 Dec 2021 12:30 PM GMT
ఓఆర్ఆర్ మీద జెట్ స్పీడ్ తో దూసుకెళ్లే అలవాటుందా.. మీకోసమే?
X
హైదరాబాద్ మహానగరంలోని వారు మాత్రమే కాదు.. హైదరాబాద్ కు ఏదో ఒక సందర్భంలో రావటం.. ఓఆర్ఆర్ (అవుటర్ రింగు రోడ్డు) మీదుగా ప్రయాణం చేసే వారంతా ఈ అప్డేట్ ను అస్సలు మిస్ కావొద్దు. ఆ.. ఏముందిలే అని చదివే విషయంలో లైట్ తీసుకున్నా.. దానికి మూల్యం వేలాది రూపాయిల్లో చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎందుకిలా? అంటే.. ఇప్పటివరకు అనుసరిస్తున్న రూల్ ను ఇప్పుడు మార్చేస్తున్నారు. ఓఆర్ఆర్ మీద గరిష్ఠంగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో మాత్రం ప్రయాణం చేయాలి.

ఇందుకు భిన్నంగా చాలా మంది 110 నుంచి 140 వరకు స్పీడ్ తో దూసుకెళ్లే వాళ్లు బోలెడంత మంది. మరికొన్ని హైబ్రిడ్ కార్లతో అయితే.. ఆ వేగం మరింత పెరుగుతుందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఇలా జెట్ స్పీడ్ తోదూసుకెళ్లే వాళ్లంతా.. తమ వాహనాల్ని సీసీ కెమేరాలు ఉండే ప్రాంతాల్లో నిర్ణీత వేగంలో వెళుతూ.. మిగిలినచోట్ల మాత్రం వాయు వేగంతో ప్రయాణిస్తూ ఉంటారు. అలాంటివారికి చెక్ చెప్పేందుకు కొత్త విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చారు.

ఇందుకోసం తాజాగా రింగు రోడ్డు ఎక్కిన వెంటనే ఎంట్రీ చెక్ పోస్టు దగ్గర నమోదైన టైంకు.. ఎగ్జిట్ చెక్ పోస్టు దగ్గర టైంను చెక్ చేస్తారు. ఈ రెండింటి మధ్య దూరం.. అందుకు పట్టిన ప్రయాణ సమయాన్ని లెక్క కట్టి.. నిబంధనలకు తగ్గట్లుగా వాహనాన్ని నడిపారా? లేదా? అన్న విషయాన్ని చెక్ చేస్తారు. ఈ విషయంలో ఏ మాత్రం తేడా కొట్టినా. .వెంటనే వారికి భారీ ఎత్తున ఫైన్ వేస్తూ తాఖీదు పంపుతారు.

ఎందుకిలా? అంటే.. అవుటర్ రింగు రోడ్డు మీద రోడ్డు ప్రమాదాన్ని తగ్గించటం కోసం.. వాహనదారులు నిబంధనల్ని పక్కాగా పాటించటం కోసం ఈ కొత్తవిధానాన్ని జనవరి మొదటి వారం నుంచి అమల్లోకి తెచ్చేలా ప్లాన్ చేశారు. అవుటర్ మీద జరిగే ప్రమాదాల్లో 30-40 శాతం రాత్రి పగతి వేళలో 60-70 శాతం జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో అత్యధికం మితిమీరిన వేగం.. ఆ సందర్భంగా వాహనాన్ని కంట్రోల్ చేసే విషయంలో విఫలం కావటంతో ప్రమాదాలు జరిగి.. ప్రాణాలు కోల్పోతున్నారు.

అందుకే.. వాటికి చెక్ చెప్పేందుకు వీలుగా ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. అంటే.. అవుటర్ ఎక్కినప్పటి నుంచి దిగే వరకు ఒళ్లు దగ్గర పెట్టుకొని.. నిబంధనల్ని తూచా తప్పకుండా పాటిస్తూ ప్రయాణం చేయాలి. ఈ విషయంలో ఏ మాత్రం తేడా కొట్టినా.. జేబుకు చిల్లు పడటం ఖాయం.