Begin typing your search above and press return to search.

కరోనా భయం ఇంతింత కాదయ.. హైదరాబాద్ మార్కెట్ డౌన్

By:  Tupaki Desk   |   5 March 2020 9:15 AM GMT
కరోనా భయం ఇంతింత కాదయ.. హైదరాబాద్ మార్కెట్ డౌన్
X
కరోనా వ్యాప్తి చెందుతోంది... మాంసాహారం తినొద్దు... సినిమాలు, షికార్లు చేయొద్దు అని పుకార్లు వినిపిస్తున్నాయి. అవి తినొద్దు... ఇవి తినాలి అని ఎవరికి తోచిన విధంగా వారు అనుకుంటూ వాళ్లే వైద్యులుగా భావించి ఆరోగ్య సూత్రాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక అక్కడ వారికి, ఇక్కడ వీరికి కరోనా వ్యాపించిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో హైదరాబాద్ బోసిపోతోంది. సినిమా టాకీస్ లు, పార్కులు, పర్యాటక ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. కరోనా భయంతో హైదరాబాద్ ను కంగారు పెడుతోంది. ఆ భయంతో హైదరాబాద్ లో వ్యాపారాలు కొనసాగడం లేదు.

కేవలం ఒకటే కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు నమోదు కాగా అదేదో హైదరాబాద్ అంతటా ఉందని ప్రచారం సాగుతోంది. దీంతో భాగ్యనగరవాసులు భయాందోళన చెందుతున్నారు. దీనికితోడు మాదాపూర్‌లోని మైండ్‌ స్పేస్‌ ఐటీ సెజ్‌ లో ప్రాంగణంలోని ఒక ఐటీ కంపెనీ తమ ఉద్యోగినికి కరోనా సోకిందనే భయంతో భవనాన్ని ఖాళీ చేసిందనే వార్త, వర్క్ ఫ్రమ్ హోం చేయాలని చేసిన మెయిల్స్ వైరలయ్యాయి. దీంతో ప్రజలు ఒక్కసారిగా తీవ్ర ఆందోళన చెందతున్నారు. అత్యవసరమైతేనే బయటకు వస్తున్నారు.

కరోనా వ్యాప్తి కన్నా స్పీడ్ గా పుకార్లు, అపోహలే వెంటనే వ్యాప్తి చెందుతున్నాయి. వాస్తవాలు తెలుసుకోకుండా ప్రచారం చేయడంతో మనకే నష్టమనే విషయాన్ని అందరూ గ్రహించాలి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ సోకిన వారిలో మరణాల రేటు కేవలం మూడు శాతం కంటే తక్కువ. మరణించిన వారిలోనూ అరవై ఏళ్లు దాటిన వాళ్లే ఎక్కువ అనే విషయం అందరూ గుర్తించాలి. అయితే ఇది సోకకుండా ఉండేందుకు ఎవరికి వారు జాగ్రత్తలు, వ్యక్తిగత శుభ్రత పాటిస్తే ఈ వైరస్ దరిచేరదని వైద్యులు చెబుతున్నారు.

ముఖ్యంగా ఐటీ ఉద్యోగుల్లో ఈ కరోనా కలవరం తీవ్రంగా ఉంది. మాదాపూర్‌లోని మైండ్‌ స్పేస్‌ ఐటీ సెజ్‌ ప్రాంగణంలోని ఒక ఐటీ కంపెనీ కరోనా నిర్ధారణ కాకముందే భవనంలో పని చేసే ఉద్యోగులు బయటకు వెళ్లిపోవాలంటూ ఆదేశాలు ఇవ్వడంతో ఐటీ ఉద్యోగులు భయం తీవ్రంగా ఉంది. అయితే ఆ కంపెనీ వర్క్‌ ఫ్రం హోం ఆప్షన్‌ ఇవ్వడంతో ప్రస్తుతం ఐటీ పరిశ్రమల్లో వర్క్‌ ఫ్రం హోం ఆప్షన్‌ పై డిమాండ్ పెరుగుతోంది. తమకు ఆ ఆప్షన్ అమలుచేయాలని పలు కంపెనీలకు వినతులు పెరిగిపోతున్నాయి. దీంతో ఆ సంస్థలు తల పట్టుకుంటున్నాయి.

వీటన్నిటి నేపథ్యంలో వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రజా జీవనం కొంత దెబ్బతినే అవకాశం ఉంది. మాస్క్‌ ధరిస్తే కరోనా రాదనేది అందరూ అంటున్నారు. దీంతో మాస్కులకు డిమాండ్ పెరిగింది. అయితే అసలు జాగ్రత్తలు వదిలేసి పిచ్చిపిచ్చి పద్ధతులు పాటిస్తున్నారు. చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవడం, కరచాలనం చేయకుండా ఉండడం, జలుబు... జ్వరంతో ఇబ్బందిపడే వారికి దూరంగా ఉండడం వంటివి చేయాలి. వీటిని పట్టించుకోవడం లేదు. వీటికి తోడు సాధారణ జలుబు, దగ్గు, జ్వరం ఉంటే ఇంకా వారంతా భయాందోళన చెందుతున్నారు. కరోనా భయంతో ప్రజా రవాణా కంటే వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించటమే మంచిదన్న అభిప్రాయం ఏర్పడింది. ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లల్లోనూ రద్దీ తగ్గింది. పీక్‌ అవర్స్‌లోనూ మెట్రో రైళ్ల లో ప్రయాణికులు పలుచగా కనిపిస్తున్నారు.

ఈ భయం హోటళ్లపై తీవ్రంగా పడింది. హోటళ్లు, రెస్టారెంట్లలో రద్దీ తగ్గింది. ముఖ్యంగా మాంసాహారం తీసుకోవడం లేదు. మాల్స్‌, మల్టీఫ్లెక్స్‌లకు ఎవరూ రావడం లేదు.