Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో నేతల ఆరాచకం ఇంత భారీగా ఉందట

By:  Tupaki Desk   |   13 Dec 2020 9:48 AM IST
హైదరాబాద్ లో నేతల ఆరాచకం ఇంత భారీగా ఉందట
X
మంత్రి ... ఎమ్మెల్యే ... ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ అధికారపక్ష నేతలపై ఆరోపణలు వెల్లువెత్తటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తెరపైకి వచ్చే ఉదంతాల సంగతి ఇలా ఉంటే.. తెర మీదకు రాకుండా గుట్టుగా.. చప్పుడు చేయకుండా సాగుతున్న అధికారపక్ష నేతల దందా ఇప్పుడు సంచలనంగా మారింది. హైదరాబాద్ మహా నగరాన్ని కేంద్రంగా చేసుకొని భూకబ్జాలకు పాల్పడుతున్న అధికార పార్టీకి చెందిన నేతలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన పలు ఉదాహరణలు బయటకు వచ్చి ఇప్పుడసంచలనంగా మారాయి.

మేడ్చల్ జిల్లా పరిధిలోని ఔటర్ రింగురోడ్డుకు సమీపంలో ఒకరి దందా గురించి చెప్పాలి. రాజకీయాల్లోకి ఇలా వచ్చి అలా మెరిపించి వెళ్లిన ఒక వ్యాపారవేత్త ఆస్తికి మోకాలడ్డు వేశారు. సదరు వ్యాపారవేత్తకు 300 ఎకరాల భవ్యమైన భూమి ఉంది. రియల్ ఎస్టేట్.. సినిమా రంగంలో పేరొందిన ఈ వ్యాపారవేత్త గతంలో టీడీపీ తరఫున నగరశివారులో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడారు. ప్రస్తుతం వ్యాపారం మీదనే ఆయన ఫోకస్ అంతా. అలాంటి ఆయన భూమి మీద కన్నేసి.. ఏకంగా రూ.200 కోట్లు కొట్టేసిన వైనం షాకింగ్ గా మారింది.

అదెలానంటే.. తనకున్న 300 ఎకరాల భూమిలో తానే వెంచర్ వేసి వ్యాపారం చేయాలనుకున్నారు. అయితే.. ఆ భూమి ఉన్న ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే..ఎమ్మెల్సీలకు ఈ భూమి మీద కన్ను పడింది. ఇరువురు కలిసి పావులు కదిపారు. ఆ భూమిని తమకే అమ్మాలని కోరారు. అందుకు ససేమిరా అన్న సదరు వ్యాపారవేత్తకు చుక్కలు చూపించారట. వేరే వారికి అమ్మే ప్రయత్నం చేస్తే.. బేరాలు రాకుండా అడ్డుకున్నారు. దీంతో.. గత్యంతరం లేక సదరు వ్యాపారవేత్త.. ఆ నేతలకే భూమిని అమ్మేందుకు సిద్ధమయ్యారు.

దీంతో.. ఆ భూమికి ఒక ధర ఫిక్స్ చేసి.. తన సన్నిహితులకు చెందిన బడా రియల్ ఎస్టేట్ సంస్థకు అప్పగించారు. అలా.. తమకు సంబంధం లేని భూమిపై వారు చేసిన వ్యాపారం పుణ్యమా అని వారికి రూ.200 కోట్లు వచ్చినట్లుగా చెబుతున్నారు. చెరో రూ.100కోట్లు జేబులో వేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ట్విస్టు ఏమిటంటే.. సదరు వ్యాపారవేత్త గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎవరి చేతుల్లో అయితే ఓడిపోయారో.. గెలిచిన ఆ వ్యక్తే ఈ మొత్తం దందాకు సూత్రధారి అని చెబుతున్నారు.

ఈ ఇద్దరు నేతల్లో ఒకరు గజ్వేల్ లో ఒకేచోట 380 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తొలిసారి ఎమ్మెల్సీ అయిన ఆయన తన అఫిడవిట్ లో రూ.10 లక్షల లోపుఆదాయాన్ని చూపిస్తే.. తాజాగా ఆయన ఆస్తి ఇప్పుడు ఏడెనిమిది వందల కోట్ల వరకు ఉంటుందని అంచనా. కొందరు పెద్దలకు ఆయన బినామీ అన్న ప్రచారం సాగుతోంది. ఇప్పుడీ వ్యవహారం సంచలనంగా మారింది.