Begin typing your search above and press return to search.

హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు తీర్చడంలో మరో మైలురాయి

By:  Tupaki Desk   |   1 Jan 2022 4:00 PM IST
హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు తీర్చడంలో మరో మైలురాయి
X
హైదరాబాద్ మహానగరంలో మరో ఫ్లై ఓవర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అతి పొడవైన ఆరు లైన్ల షేక్ పేట్ ఫ్లై ఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కొత్త ఏడాదిలో పాత, కొత్త నగరాలను కలిపే ఫ్లై ఓవర్ ను ప్రారంభించి ప్రయాణికుల కష్టాలు తీర్చారు.

హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు తీర్చడంలో మరో మైలురాయిగా షేక్ పేట ఫ్లైఓవర్ నిలుస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. కొత్త ఏడాదిలో దీన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఏడున్నరేళ్లుగా ఎస్ఆర్డీపీ కింద హైదరాబాద్ నగరంలో 24 కార్యక్రమాలు పూర్తి చేసుకున్నామని మంత్రి అన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించేలా చాలా పురగోతి సాధించామన్నారు. ఇంకా చేయాల్సింది ఉందన్నారు. ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన నివేదికలో తెలంగాణ దేశానికి ఆర్థిక అభివృద్ధిలో నాలుగో పెద్ద రాష్ట్రంగా గుర్తింపునిచ్చిందన్నారు.

హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం ఎప్పుడూ సహకరిస్తుందని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ రీజినల్ రింగురోడ్డు వస్తే దేశంలో భాగ్యనగరంను మించిన నగరం ఏదీ ఉండదన్నారు. రసూల్ పురా జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మించేందుకు కేంద్రం సహకరించాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కోరారు. కంటోన్మెంట్ ఏరియాలో రోడ్లు మూసివేత స్థానికులకు ఇబ్బందిగా మారిందన్నారు.

కిషన్ రెడ్డి రక్షణశాఖ మంత్రితో మాట్లాడి కంటోన్మెంట్ రోడ్డు తెరిచేలా చొరవ తీసుకోవాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. నగరంలో స్కై వేల నిర్మాణానికి రక్షణ శాఖ భూములు ఇవ్వాలన్నారు.

హైదరాబాద్ లోనే అతి పొడవైన ఆరు లైన్ల షేక్ పేట ఫ్లై ఓవర్ ను శనివారం ఉదయం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దాదాపు రూ.333.55 కోట్లతో 2.71 కి.మీ మేర ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయ్యింది. దాదాపు 24 మీటర్ల వెడల్పుతో ఆరు లైన్లుగా టు వే ట్రాఫిక్ ను ఏర్పాటు చేశారు.

షేక్ పేట ఫ్లై ఓవర్ ప్రధానంగా నాలుగు ప్రధాన జంక్షన్లను కవర్ చేయనుంది. షేక్ పేట, ఫిలింనగర్, ఓయూ కాలనీ, విస్పర్ వ్యాలీ జంక్షన్ లు దాటి నేరుగా ప్రయాణం చేసేందుకు వీలుగా ఫ్లై ఓవర్ నిర్మాణం జరిగింది.