Begin typing your search above and press return to search.

హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలుతీర్చిన కేటీఆర్

By:  Tupaki Desk   |   6 July 2021 4:00 PM IST
హైదరాబాద్ ట్రాఫిక్  కష్టాలుతీర్చిన కేటీఆర్
X
హైదరాబాద్ లో ట్రాఫిక్ అంటే చమటలు కక్కాల్సిందే. ఇంటి నుంచి ఆఫీసులకు బయలు దేరాలంటే గంటల సమయం రోడ్లపై వేచి ఉండాల్సిందే. భారీ ట్రాఫిక్ తో అత్యంత దుర్భరమైన సమస్యను ఎదుర్కొంటోంది భాగ్యనగరం. ఇప్పుడు హైదరాబాదీల కష్టాలు తీర్చేలా మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది.

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు మరో ఫ్లై ఓవర్ ను తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. బాలానగర్ చౌరస్తాలో నిర్మించిన ఫ్లై ఓవర్ ను ఓ కార్మికురాలితో కలిసి మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవర్ కు ‘బాబు జగ్జీవన్ రాం’ పేరును పెట్టనున్నట్లు మంత్రి తెలిపారు.

హైదరాబాద్ లోనే అత్యంత దుర్భరమైన ట్రాఫిక్ సమస్య బాలానగర్ చౌరస్తాలో ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్.ఆర్.డీపీ నిధులతో హెచ్ఎండీఏ ప్రారంభించి మొత్తం సుమారు నాలుగు సంవత్సరాల సమయంలో పూర్తి చేశారు.

387 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జిని ఆరు లైన్లతో నిర్మించారు. బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఎస్.ఆర్.డీపీ కింద నగరంలో మొత్తం 30వేల కోట్లతో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు నిర్మాణం చేపట్టామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఒక్క కూకట్ పల్లి నియోజకవర్గంలోనే వెయ్యి కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన వెంటనే హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు కేసీఆర్ నడుం బిగించారని.. అందులో భాగంగానే ఎస్.ఆర్డీపీ నిధుల కింద ప్రాజెక్టులు చేట్టామని మంత్రి కేటీఆర్ వివరించారు.

ఇక ఈ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ రిబ్బన్ కటింగ్ చేయకుండా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ ఫ్లై ఓవర్ నిర్మాణంలో భాగస్వాములు అయిన కార్మికులను గౌరవించుకునేందుకు గత నాలుగేళ్లుగా పనిచేస్తున్న వనపర్తి జిల్లాకు చెందిన శివమ్మ అనే కార్మికురాలి చేత రిబ్బన్ కట్ చేయించారు. ఇది తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు ఇస్తున్న గౌరవమని వ్యాఖ్యానించారు. ఇక పాట్నీ నుంచి తూంకుంట వరకు సుచిత్ర చౌరస్తా వరకు మరో ఫ్లై ఓవర్ నిర్మిస్తామని.. కేంద్ర రక్షణ శాఖ అనుమతి వచ్చిన వెంటనే మొదలుపెడుతామని కేటీఆర్ వివరించారు.