Begin typing your search above and press return to search.

డేంజర్ జోన్ లో హైదరాబాద్ !

By:  Tupaki Desk   |   23 Nov 2019 6:01 AM GMT
డేంజర్ జోన్ లో హైదరాబాద్ !
X
కాలుష్యం.. పట్టణాలు, నగరాలకు సవాల్‌గా మారిన సమస్య. రోజు రోజుకు ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ఈ కాలుష్య సమస్య గ్రేటర్ హైదరాబాద్‌ ను సైతం పట్టిపీడిస్తున్నది. ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టమౌతోంది. రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతున్న పొల్యూషన్‌తో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటకెళ్ళేటప్పుడు మాస్క్ తప్పనిసరి అని వైద్యులు చెప్తున్నారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకొని బయటపడలేక తల్లడిల్లుతోంది. ఇక ఇప్పుడు హైదరాబాద్ లో కూడా అవే పరిస్థితులు వచ్చేలా కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం హైద్రాబాద్ లో చలి తీవ్రత అధికంగా ఉండటంతో స్వేచ్చగా ఊపిరి తీసుకోవడం కష్టతరమౌతోంది. అస్తమాతో బాధ పడుతున్న వారి పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుత వాతావరణం స్వైన్ ఫ్లూ కారక వైరస్, ఇతర బ్యాక్టీరియాల వృద్ధికి అనుకూలంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, పిల్లలు, గర్భిణీల పై ఎక్కువ ప్రభావం చూపుతుంది. వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు..వాహన, పారిశ్రామిక కాలుష్యానికి దూరంగా ఉండడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

2019, నవంబర్ 22వ తేదీ శుక్రవారం నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 158గా నమోదైంది. అందులో పీఎం 2.5 పీఎం 1.0 ఉద్గారాల తీవ్రత నమోదైంది. గాలిలో సల్ఫర్ డయాక్సైడ్, హైడ్రో కార్బన్స్, నైట్రోజన్ ఆక్సైడ్, అమ్మోనియం, కార్బోమోనాక్సైడ్ వంటి రసాయనాలు కలిసిపోవడం, పొగమంచులో ఇవి కలిసిపోయి శ్వాస తీసుకున్నప్పుడు అవి నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాస సంబంధ సమస్యలకు కారణమౌతున్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే..నగరంలో వాహన కాలుష్యం ఎక్కువ ఉంది. సాధ్యమైనంత వరకు గ్రీనరీ ప్రదేశాల్లో ఎక్కువగా గడపడం వల్ల వీటి నుంచి బయటపడొచ్చని వైద్యులు చెప్తున్నారు.