Begin typing your search above and press return to search.

హైదరాబాద్ సీపీ సంచలన వ్యాఖ్యలు.. ఆర్టీసీ ఉద్యోగుల వెనుక మావోలు

By:  Tupaki Desk   |   9 Nov 2019 3:03 PM GMT
హైదరాబాద్ సీపీ సంచలన వ్యాఖ్యలు.. ఆర్టీసీ ఉద్యోగుల వెనుక మావోలు
X
సంచలన ఆరోపణలు చేశారు హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్. గడిచిన 35 రోజులుగా తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమం చేస్తున్న ఆర్టీసీ కార్మికులు నిషేధిత మావోయిస్టు సంఘాలతో చేతలు కలిపినట్లుగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మావో అనుబంధ సంస్థలతో సంబంధం ఉన్న కారణంగానే ట్యాంక్ బండ్ మీద జరిగిన చలో ట్యాంక్ బండ్ కు అనుమతి ఇవ్వలేదన్నారు. ఈ రోజు జరిగిన చలో ట్యాంక్ బండ్ హింసాత్మకంగా మారటం.. పోలీసుల తీరుపైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న వేళ.. ప్రభుత్వం డిఫెన్స్ లో పడిందన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇలాంటివేళ మీడియా ముందుకు వచ్చిన హైదరాబాద్ సీపీ.. ఆర్టీసీ కార్మిక సంఘాలకు మావోలకు సంబంధాలున్నాయన్న ఆరోపణలతో సంచలన బాంబు పేల్చారని చెప్పాలి.

నిరసనలో భాగంగా ట్యాంక్ బండ్ మీద దూసుకొచ్చిన నిరసనకారుల్ని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేయటం.. ఆ క్రమంలో తీవ్రంగా గాయపడిన వారిని చూసిన కొందరు పోలీసుల మీద రాళ్లు విసిరినట్లుగా ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతుంటే.. అందుకు భిన్నంగా హైదరాబాద్ సీపీ ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల నిషేధం ఉన్న మావో సంఘాలతో ఆరటీసీ సంఘాలు పోలీసులపైకి రాళ్లు విసిరారంటూ ఆరోపణలు చేశారు.

రాళ్లదాడిలో ఏడుగురు పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయని చెప్పిన ఆయన.. అందుకు బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు పెడతామన్నారు. చలో ట్యాంక్ బండ్ కు అనుమతి ఇవ్వకున్నా.. తమ మాట వినకుండా పెద్ద సంఖ్యలో కార్మికులు ట్యాంక్ బండ్ వైపు చొచ్చుకొచ్చారన్నారు.

ఆందోళకారులు విసిరిన రాళ్ల కారణంగా అడిషనల్ డీసీపీ రామచంద్రరావ్.. ఏసీపీ రత్నం.. సీఐ సైదిరెడ్డి.. ఎస్ ఐ శేఖర్.. కానిస్టేబుల్ రాజులు గాయపడ్డారని.. ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకే పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారన్నారు. ఇప్పటివరకూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేసినప్పటికీ అవేమీ సాధ్యం కాని వేళ.. హైదరాబాద్ సీపీ చేసిన మావో వ్యాఖ్యలు కలకలంగా మారాయి.