Begin typing your search above and press return to search.

హైదరాబాద్ అబ్బాయితో పాక్ అమ్మాయి లవ్.. దేశంలోకి అక్రమంగా ఎంట్రీ

By:  Tupaki Desk   |   11 Aug 2022 9:04 AM GMT
హైదరాబాద్ అబ్బాయితో పాక్ అమ్మాయి లవ్.. దేశంలోకి అక్రమంగా ఎంట్రీ
X
సినిమా స్టోరీని తలపించే లవ్ స్టోరీ తాజాగా వెలుగు చూసింది. హైదరాబాద్ కు చెందిన అబ్బాయికి (ఇప్పుడు సౌదీలో ఉన్నాడు) పాకిస్తాన్ కు చెందిన అమ్మాయి ఆన్ లైన్ లో పరిచయం కావటం.. అది కాస్తా ప్రేమగా మారి.. పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతో తప్పుడు ధ్రువపత్రాలతో భారత్ లోకి అక్రమంగా ప్రవేశించిన బిహార్ లో పట్టుబడిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఇది నిజంగానే లవ్ స్టోరీనా? లేదంటే ఉగ్రకుట్ర? అన్నదిప్పుడు అనుమానంగా మారింది. దీనికి సంబంధించిన వివరాల్ని ఆరా తీసేందుకు పోలీసులు.. నిఘా అధికారులు రంగంలోకి దిగారు.

సినిమా స్టోరీని తలపించేలా ఉన్న ఈ రియల్ స్టోరీలోకి వెళితే.. హైదరాబాద్ పాతబస్తీలోని బహదూర్ పురాకు చెందిన అహ్మద్ కొన్నేళ్లుగా సౌదీలో ఉంటున్నాడు. అక్కడి హోటల్ లో పని చేస్తున్నాడు. ఇతడికి పాక్ లోని ఫైసలాబాద్ కు చెందిన ఖాదిజా నూర్ అనే అమ్మాయి సోషల్ మీడియాలో పరిచయమైంది. వారిద్దరి పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. నూర్ తన ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే వారు నో అన్నారు. దీంతో.. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న అహ్మద్.. అందుకు తగ్గ మార్గాల్ని వెతికాడు.

ఇక్కడ సరైన మార్గంలో వెతికి ఉంటే అంతా బాగుండేది. కాస్త కష్టమైనా కథ సుఖాంతమయ్యేది. కానీ.. అతడు ఆమెను హైదరాబాద్ కు అక్రమంగా పంపి.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకోవటం.. అది కాస్త బయటకు వచ్చేసి ఇప్పుడు పోలీసుల వద్ద బందీలుగా మారారు.అదెలా జరిగిందంటే.. సౌదీలో తాను పని చేస్తున్న హోటల్లోని నేపాలీ స్నేహితులతో తన లవ్ స్టోరీ చెప్పగా.. వారు ఒక దరిద్రపుగొట్టు ఐడియా ఇచ్చారు. నూర్ ను నేపాల్ మీదుగా హైదరాబాద్ కు పంపుదామని.. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇందులో భాగంగా వారికి సాయం చేయటానికి జీవన్ అనే నేపాలీని ఏర్పాటు చేశారు.

అహ్మద్ కు సాయం చేయటానికి అతని సోదరుడు మహ్మద్ రంగంలోకి దిగాడు. నూర్ కోసం తప్పుడు ఆధార్ కార్డు అది కూడా హైదరాబాద్ అడ్రస్ తో తయారు చేయించాడు. దీన్ని తీసుకొని మహ్మద్ నేపాల్ కు చేరుకున్నాడు. నూర్ పాక్ నుంచి దుబాయ్ కు వెళ్లి.. అక్కడి నుంచి నేపాల్ వచ్చింది. నేపాల్ లో నెల రోజులు టూరిస్టు వీసా తీసుకున్న ఆమె.. తన ప్రియుడి బ్రదర్ తో కలిసి ఇండో -నేపాల్ సరిహద్దు అయిన బిహార్ లోని సీతమ్రహీ జిల్లా బిట్టామోర్ బోర్డర్ ఔట్ పోస్టుకు చేరుకున్నాడు. తెల్లవారు జామున వారు భారత్ లోకి ప్రవేశిస్తూ ఎస్ఎస్ బీ అధికారుల కళ్లల్లో పడ్డారు.

వీరిని తనిఖీ చేయగా.. వారికి సంబంధించిన వస్తువులు అనుమానాస్పదంగా ఉండటంతో అలర్ట్ అయ్యారు. నూర్ వద్ద హైదరాబాద్ మహిళగా ఆధార్ కార్డు.. పాకిస్థాన్ పాస్ పోర్టు.. ఫైసలాబాద్ లోని జీసీ ఉమెన్ వర్సిటీలో సైకాలజీ చదువుతున్నట్లుగా గుర్తింపు కార్డు.. పాక్ కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తో పాటు నేపాల్ వీసా ఉంది. దీంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించారు.

పంద్రాగస్టు నేపథ్యంలో ఉగ్రకుట్రలో భాగంగా ఏమైనా కుట్రకు పాల్పడ్డారా? అన్న సందేహం తో పాటు.. గూఢచర్యంలో భాగంగా ఇండియాకు వచ్చిందేమోనన్న సందేహంతో లోతుగా విచారించారు.దీంతో అసలు వివరాలు బయటకు వచ్చాయి. ఆమె సైకాలజీ స్టూడెంట్ అని.. ప్రియుడు కోసం తప్పుడు మార్గంలో హైదరాబాద్ కు చేరుకోవాలన్న ప్లాన్ లో భాగంగా వచ్చి భద్రతా దళాలకు చిక్కినట్లుగా గుర్తించారు. దీంతో.. అమెను అరెస్టు చేసి పాక్ ఎంబసీకి సమాచారం ఇచ్చారు.

తాజాగా సమాచారం అందుకున్న తెలంగాణ నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. అహ్మద్.. మహ్మద్ కు సంబంధించిన వివరాల్ని ఆరా తీస్తున్నాయి. వీరిని విచారించేందుకు వీలుగా ఒక టీం బీహార్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. ప్రేమిస్తే.. దాని సొంతం చేసుకోవటానికి నిజాయితీగా ప్రయత్నించాలే తప్పించి.. అక్రమ మార్గాన ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుందన్న విషయం ఈ ఉదంతం మరోసారి రుజువు చేస్తుందని చెప్పాలి.