Begin typing your search above and press return to search.

హైద‌రాబాదీల దెబ్బ‌కు మెట్రో రికార్డుల‌న్నీ బ‌ద్ధ‌లు

By:  Tupaki Desk   |   30 Nov 2017 3:31 AM GMT
హైద‌రాబాదీల దెబ్బ‌కు మెట్రో రికార్డుల‌న్నీ బ‌ద్ధ‌లు
X
హైద‌రాబాదీ అంటేనే అంత అన్నట్లుంది తాజాగా అందిన అధికారిక స‌మాచారం వింటే. హైద‌రాబాదీల‌కు న‌చ్చితే చాలు.. రికార్డులు త‌మ‌ను తాము స‌రి చేసుకుంటాయి. తాజాగా అదే జ‌రిగింది. ఎంతోకాలంగా ఎదురుచూసిన మెట్రో రైల్ ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చిన తొలిరోజే ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న రికార్డుల‌న్నీ బ‌ద్ధ‌లైపోయాయ్‌.

తొలిరోజు మెట్రోలో ప్ర‌యాణించిన ప్ర‌యాణికుల సంఖ్య ల‌క్షకు పైనే అంటూ మంత్రి కేటీఆర్ బుధ‌వారం రాత్రి ట్వీట్ చేసి.. త‌న అభినంద‌న‌లు తెలిపారు. అయితే.. కేటీఆర్‌ కు అందిన స‌మాచారానికి మించిన స్థాయిలో హైద‌రాబాదీల ఉత్సాహం ఉంద‌న్న విష‌యం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. స్టార్ హీరో సినిమా రిలీజ్ సంద‌ర్భంగా ఎలాంటి ఓపెనింగ్స్ వ‌చ్చాయో.. అదే స్థాయిలో హైద‌రాబాద్ మెట్రో రైల్ మొద‌టిరోజు ఓపెనింగ్స్ వ‌చ్చాయ‌ని చెప్పాలి.

దేశంలో ఇప్ప‌టివ‌రకూ ప్రారంభ‌మైన అన్ని మెట్రో స్టేష‌న్ల‌లో తొలిరోజు ప్ర‌యాణించిన ప్ర‌యాణికుల సంఖ్య 50వేలు మాత్ర‌మే. అయితే.. ఈ రికార్డు మ‌ధ్యాహ్నం ప‌న్నెండు గంట‌ల వేళ‌కే బ్రేక్ అయిపోయాయ్‌. దీంతో ఉత్సాహంతో హైద‌రాబాద్ మెట్రోతో పాటు.. ఎల్ అండ్ టీ వ‌ర్గాలు సాయంత్రం వేళ ప్రెస్ మీట్ పెట్టారు. హైద‌రాబాద్ మెట్రో రైల్ సూప‌ర్ హిట్ అయిన‌ట్లు ప్ర‌క‌టించారు.

అయితే.. మెట్రో వ‌ర్గాల అంచనాల్ని త‌ల‌కిందులు చేసేలా ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. హైద‌రాబాదీల ఉత్సాహాన్ని మెట్రో వ‌ర్గాలు సైతం ఊహించ‌నిరీతిలో ఉంద‌న్న విష‌యం తాజాగా విడుద‌లైన గ‌ణాంకాలు స్ప‌స్టం చేస్తున్నాయి. తొలిరోజు హైద‌రాబాద్ మెట్రోలో ప్ర‌యాణించిన ప్ర‌యాణికుల సంఖ్య ఏకంగా రెండుల‌క్ష‌ల‌కు దాటిన‌ట్లు ప్ర‌క‌టించారు. అంటే.. మిగిలిన మెట్రో రైల్ స్టేష‌న్ల‌తో పోలిస్తే.. నాలుగు రెట్లు అధికంగా ప్ర‌యాణికుల రూపంలో హైద‌రాబాదీలు పోటెత్తార‌న్న మాట‌. రానున్న రోజుల్లో ఇలాంటి మ‌రెన్నో చోటు చేసుకోవ‌టం ఖాయ‌మ‌న్న అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.