Begin typing your search above and press return to search.

హుజూరాబాద్ టీఆర్ఎస్అభ్యర్థిగా ఈయనే!?

By:  Tupaki Desk   |   24 July 2021 10:30 AM GMT
హుజూరాబాద్ టీఆర్ఎస్అభ్యర్థిగా ఈయనే!?
X
ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ‘హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు?’ అన్నదే హాట్ ప్రశ్న. దీనికి అటు కేసీఆర్ కానీ.. ఇటు టీఆర్ఎస్ శ్రేణుల నుంచి సమాధానం రావడం లేదు. దీంతో అభ్యర్థి ఎవరన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికీ కూడా చాలా మంది పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి.

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక కాకరేపుతోంది. రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది. ఈ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ తరుఫున ఈటల రాజేందర్ పేరు కన్ఫర్మ్ అయ్యింది. అయితే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్ ల తరుఫున అభ్యర్థులు ఎవరన్న దానిపై మాత్రం సందిగ్ధత కొనసాగుతోంది. ఈటలకు ధీటైన వ్యక్తిని హుజూరాబాద్ లో నిలబెట్టాల్సి ఉంటుంది.

ఈ క్రమంలోనే తాజాగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మరో సరికొత్త పేరు తెరపైకి వచ్చింది. ఎన్నారై పాకాల శ్రీకాంత్ రెడ్డి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది.టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఈ మేరకు ఆయన పేరును పరిశీలించి ఖరారు చేసినట్లుగా ప్రచారం సాగుతోంది.

కేసీఆర్ ప్రస్తుతం హుజూరాబాద్ లో పలువురి పేర్లను అనుకుంటున్నారు. ముఖ్యంగా ఇటీవలే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరి కౌశిక్ రెడ్డి పేరు ప్రథమ స్థానంలో ఉంది. ఆ తర్వాత టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరిన ఎల్.రమణ పేరు వినిపిస్తోంది. ఇక హుజూరాబాద్ బరిలో మరికొందరి పేర్లు తెరపైకి వచ్చాయి.

తాజాగా పలువురి పేర్లను పరిశీలించిన తర్వాత కేసీఆర్ ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. పాకాల శ్రీకాంత్ రెడ్డి స్వగ్రామం వీణవంక మండలంలోని అన్నారం గ్రామం. ఈయన స్థాపించిన సాఫ్ట్ వేర్ కంపెనీ సునేరా టెక్నాలజీ దేశ విదేశాల్లో పలువురికి ఉపాధి కల్పిస్తోంది.

పాకాల శ్రీకాంత్ రెడ్డి కుటుంబానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంచి గుర్తింపు ఉంది. దాన్ని పరిగణలోకి తీసుకొని శ్రీకాంత్ రెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై కొద్దిరోజుల్లోనే క్లారిటీ రానుంది.