Begin typing your search above and press return to search.

ఉప ఎన్నికకు డెల్టాప్లస్ దెబ్బ పడుతుందా?

By:  Tupaki Desk   |   25 Jun 2021 10:30 AM GMT
ఉప ఎన్నికకు డెల్టాప్లస్ దెబ్బ పడుతుందా?
X
సెకండ్ వేవ్ పోయి.. థర్డ్ వేవ్ రావటానికి మధ్య లభించే విరామంతో అంతో ఇంతో హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చన్న అంచనాలకు భిన్నంగా మొదలైన డెల్టా ప్లస్ వేరియంట్ కొత్త ఆందోళనకు కారణంగా మారింది. కొన్ని దేశాలతో పోలిస్తే.. మన దేశంలో డెల్టా ప్లస్ ముప్పు తక్కువే. అయితే.. కొన్ని రాష్ట్రాల్లో వేగంగా పెరుగుతున్న ఈ వేరియంట్ కేసుల్ని చూసినప్పుడు.. రానున్న రోజుల్లో డెల్టా ప్లస్ వేరియంట్ ఇబ్బందికరంగా మారుతుందన్న మాట వినిపిస్తోంది.

మరోవైపు.. ఖాళీగా ఉన్న అసెంబ్లీ.. లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించే విషయంలో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఎమ్మెల్సీ స్థానాలు పెద్ద ఎత్తున ఖాళీ అయ్యాయి. తెలంగాణలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఆయన ప్రాతినిధ్యం వహించే హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎప్పుడున్నది ఆసక్తికరంగా మారింది.

ఈ మధ్యనే తెలంగాణలో లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తేసిన నేపథ్యంలో.. సెప్టెంబరు.. అక్టోబరులో ఎన్నికలకు ఎక్కువ అవకాశం ఉందంటున్నారు. అయితే.. అప్పటికి థర్డ్ వేవ్ దూసుకొచ్చే ప్రమాదం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం.. సెప్టెంబరు.. అక్టోబరులో థర్డ్ వేవ్ దేశాన్ని తాకుతుందని చెబుతున్నారు. అయితే.. డెల్టా ప్లస్ వేరియంట్ పుణ్యమా అని.. థర్డ్ వేవ్ మరింత ముందు వచ్చేసినా ఆశ్చర్యం లేదు. అంటే.. ఆగస్టు నుంచి అక్టోబరు మధ్య వరకు కరోనా తీవ్రతఎక్కువగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అయితే జులైలో లేదంటే.. డిసెంబరు తర్వాతే ఉప ఎన్నిక నిర్వహణకు సరైన సమయమన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా ఉప ఎన్నిక మీద డెల్టాప్లస్ ప్రభావం ఉంటుందని చెప్పక తప్పదు.