Begin typing your search above and press return to search.

2023 ఎన్నికల మాట తర్వాత ఈటల.. ముందు ఉప ఎన్నిక సంగతి చూడు

By:  Tupaki Desk   |   18 Jun 2021 5:30 AM GMT
2023 ఎన్నికల మాట తర్వాత ఈటల.. ముందు ఉప ఎన్నిక సంగతి చూడు
X
టీఆర్ఎస్ తో సాగిన సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించి.. అవమానకర రీతిలో పార్టీ నుంచి బయటకు వచ్చేసి బీజేపీతో జత కట్టిన ఈటల..బీజేపీ నేత హోదాలో తొలిసారి తన నియోజకవర్గానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. ముంచుకొస్తున్న ఉప ఎన్నిక.. మరోవైపు పక్కాగా గ్రౌండ్ వర్కు చేస్తూ.. ఈటలకు దిమ్మ తిరిగే షాకివ్వటంతో పాటు.. రాజకీయ ప్రత్యర్థులు వణికేలా తన సత్తా చాటాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పని దాదాపుగా పూర్తి అయినట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. మాజీ మంత్రి ఈటల మాటలు మరోలా ఉన్నాయి. 2023లో జరిగే ఎన్నికల్లో కేసీఆర్ అహంకారానికి ప్రజలు గోరీ కడతారని ఆయన మండిపడుతున్నారు. ఇదంతా ఓకే. ముందుగా తన లక్ష్యమైన ఉప ఎన్నిక మీద ఈటల ఫోకస్ చేయాలని చెబుతున్నారు. ఉప ఎన్నికల ఫలితం రానున్న రోజుల్లో చోటు చేసుకునే రాజకీయ పరిణామాల్ని డిసైడ్ చేస్తుందని చెప్పక తప్పదు.

ఇలాంటి సమయంలో తన ఫోకస్ మొత్తం ఉప ఎన్నిక మీదనే ఉండాలే తప్పించి.. 2023లో జరిగే సార్వత్రిక ఎన్నికల ప్రస్తావనే అవసరం లేదని చెప్పాలి. కొద్ది నెలల్లో జరిగే హూజురాబాద్ ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారన్న విషయాన్ని ఈటలే స్వయంగా వెల్లడించారు. ఎప్పుడూ లేని విధంగా ఒక్కో మండలానికి ఒక మంత్రిని.. ఎమ్మెల్యేను నియమిస్తున్నారని.. స్థానిక ప్రజా ప్రతినిధుల్ని పక్కన పెట్టేస్తున్నట్లు ఆరోపించారు.

కార్డులు.. పింఛన్లు ఇస్తామని.. డబ్బులు ఇచ్చి సమావేశాలకుతీసుకెళుతున్నట్లు చెప్పారు. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్న వేళ.. ఎప్పుడో వచ్చే ఎన్నికల్ని వదిలేసి.. ముందు ఉప ఎన్నిక మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఈటలకు ఎంతైనా ఉంది. ఈ విషయంలో ఏ మాత్రంపొరపాటుజరిగినా.. అందుకు మూల్యం భారీగా చెల్లించాల్సి వస్తుందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఈటల మరేం చేస్తారో చూడాలి.