Begin typing your search above and press return to search.

హుజూరాబాద్, బద్వేల్ ఎన్నికలకు షెడ్యుల్ విడుదల.. ఎన్నిక ఎప్పుడంటే?

By:  Tupaki Desk   |   28 Sep 2021 5:25 AM GMT
హుజూరాబాద్, బద్వేల్ ఎన్నికలకు షెడ్యుల్ విడుదల.. ఎన్నిక ఎప్పుడంటే?
X
తెలుగు రాష్ట్రాల్లో అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్, బద్వేలు ఉప ఎన్నికల పోలింగ్ షెడ్యూల్ ను ఎట్టకేలకు ఎన్నికల సంఘం విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 1న ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు.

దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పార్లమెంట్, ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మూడు పార్లమెంట్, 30 శాసనసభ నియోజకవర్గాలకు ఈ ఎన్నికలు జరుగనున్నాయి.

వీటిల్లో తెలుగు రాష్ట్రాల్లోని హుజూరాబాద్, బద్వేల్ శాసనసభ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. హుజూరాబాద్, బద్వేల్ లో అక్టోబర్ 30న ఎన్నికల పోలింగ్ జరుగనుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ లో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇక బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే మరణంతో అక్కడ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ బీజేపీ నుంచి తలపడబోతున్నారు. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ఖరారు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించలేదు.

ఉప ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం పలు ఆంక్షలు విధించింది. కరోనా నిబంధనల మేరకే ప్రచారం చేయాలని సీఈసీ చెప్పింది. ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం విధించింది. వెయ్యిమంది జనాలకు మించకుండా సభలు పెట్టాలని సూచించింది.

-హుజూరాబాద్, బద్వేలు షెడ్యూల్ ఇదే

-నోటిఫికేషన్ : అక్టోబర్ 1
నామినేషన్లకు చివరి తేది : అక్టోబర్ 8,
నామినేషన్ల ఉపసంహరణ: అక్టోబర్ 13,
ఉప ఎన్నికల పోలింగ్ తేది: అక్టోబర్ 30,
ఓట్ల లెక్కింపు, ఫలితాలు :నవంబర్ 2