Begin typing your search above and press return to search.

భార్యను కెనడాలో వదిలేసి వచ్చిన భర్త

By:  Tupaki Desk   |   18 Sept 2021 6:22 PM IST
భార్యను కెనడాలో వదిలేసి వచ్చిన భర్త
X
కెనడాలోని మాన్‌ట్రీల్ లో హైదరాబాద్‌కు చెందిన యువతి అవస్థలు ఎదుర్కొంటోంది. రెండు నెలల గర్భవతి అయిన దీప్తి రెడ్డిని కెనాలోనే వదిలేసి హైదరాబాద్‌కు వచ్చేశాడు ఆమె భర్త చంద్రశేఖర్ రెడ్డి. మెక్‌గ్రిల్ యూనివర్సిటీలో కెమిస్ట్రీ విభాగంలో పోస్ట్‌డాక్‌ గా పని చేస్తున్న చంద్రశేఖర్.. ఆగస్టు 9వ తేదీన ఇండియాకు తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి మళ్లీ వెళ్లలేదు. అయితే, అతని ఆచూకీ మాత్రం తెలియడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 20వ తేదీ కెనడాలోని ఇండియన్ హై కమిషన్‌కు దీప్తి ఫిర్యాదు చేసింది.

ప్రయోజనం లేకపోవడంతో తాజాగా భర్త ఆచూకీ కోసం ట్విట్టర్ కేంద్రంగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది దీప్తి రెడ్డి. తన భర్త ఆచూకీ తెలుపాలంటూ లేఖలో పేర్కొంది. దీప్తి లేఖపై స్పందించిన విదేశాంగ శాఖ అధికారులు విషయాన్ని తెలంగాణ పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన రాచకొండ సీపీ మహేష్ భగవత్,. చంద్రశేఖర్ ఆచూకీ కనిపెట్టాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

ఇదిలాఉంటే.. చంద్రశేఖర్ రెడ్డి అన్న శ్రీనివాస్.. చైతన్యపురి పీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శ్రీనివాసే తన భర్త చంద్రశేఖర్‌ను దాచాడంటూ దీప్తి తాను రాసిన లేఖలో పేర్కొంది. ఈ నేపథ్యంలో దీప్తి కుటుంబ సభ్యులు శ్రీనివాస్ ఇంటికి ముందుకు వచ్చి ఆందోళనకు దిగారు. మరోవైపు భువనగిరిలో ఉన్న దీప్తి పేరెంట్స్‌తో పోలీసు అధికారులు సంప్రతింపులు జరుపుతున్నారు. చంద్రశేఖర్ రెడ్డి వ్యవహారంపై దీప్తి రెడ్డి పేరెంట్స్,భువనగిరి మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన భువనగిరి మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు.. దర్యాప్తు చేస్తున్నారు. దీప్తి ఫిర్యాదు చేస్తే చంద్రశేఖర్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. కాగా, దీప్తి బంధువులు ఎవరైనా ఉంటే సీపీని కలవాలని రాచకొండ పోలీసులు ట్వీట్ చేశారు.

నా పేరు దీప్తి రెడ్డి. నేను మాన్‌ట్రీల్‌లో ఉంటున్నాను. నేను ఇక్కడికి మూడు నెలల క్రితం వచ్చాను. నా భర్త అనుగుల చంద్రశేఖర్ రెడ్డి. మెక్‌గ్రిల్ యూనివర్సిటీలో కెమిస్ట్రీ విభాగంలో పోస్ట్‌డాక్‌ గా పని చేస్తున్నాడు. అతడు నాకు ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా ఆగస్టు 9న ఇండియాకు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి నాకు అతనితో, అతని కుటుంబంతో ఎలాంటి కాంటాక్ట్ లేకుండా పోయింది. వారి ఫోన్లలో నా నెంబర్‌ను బ్లాక్ చేశారు. వారు ఇప్పుడు బంధువుల ఇళ్లలో దాక్కున్నారు. నేను ఇప్పుడు రెండు నెలల గర్భవతిని. నేను ప్రస్తుతం ఉన్న ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో ఇండియాకు ప్రయాణం చేయలేను. నా భర్త సోదరుడు శ్రీనివాస్ రెడ్డి చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. నా భర్త ఎక్కడ ఉన్నాడు నాకు తెలియడు. ఆయన ఆరోగ్యం గురించి నేను ఆందోళన చెందుతున్నాను. నా భర్త ఎక్కడున్నాడు కనుక్కోవడానికి సాయం చేయండి’అని కోరారు.