Begin typing your search above and press return to search.

తోపుల్లాంటి నేతల్ని ఇంట్లోకే రానివ్వలేదు

By:  Tupaki Desk   |   5 Sep 2016 5:55 AM GMT
తోపుల్లాంటి నేతల్ని ఇంట్లోకే రానివ్వలేదు
X
కశ్మీర్ లో ఏం జరుగుతుంది? గడిచిన కొద్ది వారాలుగా అట్టుడిగిపోతున్న కశ్మీర్ లో పరిస్థితుల్ని సాధారణ స్థాయికి తెచ్చేందుకు అఖిలపక్షం నేతల బృందం అక్కడకు వెళ్లటం తెలిసిందే. దేశంలోని వివిధ పార్టీలకు చెందిన దాదాపు 200 మందితో కూడిన బృందం కశ్మీర్ కు వెళ్లారు. ఆదివారం కశ్మీర్ లో వేర్పాటు నేతలతో కలిసి చర్చలు జరిపేందుకు ప్రయత్నించిన ఎంపీలకు చేదు అనుభవం ఎదురైంది.

వివిధ పార్టీలకు చెందిన తోపుల్లాంటి నేతలతో పాటు.. పలువురు ఎంపీలు ఐదుగురు చొప్పున ఒక బృందంగా ఏర్పడి పలువురు హురియత్ నాయకుల్ని కలిసే ప్రయత్నం చేశారు. అయితే.. ఈ ప్రయత్నాలకు సానుకూలత వ్యక్తం కాలేదుసరికదా.. ఇంట్లోకి రమ్మని కూడా ఆహ్వానించకపోవటం గమనార్హం. కొందరు కశ్మీరీ నాయకులైతే.. అఖిలపక్షం నేతల్ని ఇంటి బయట నుంచే వెళ్లిపోవాలని చెప్పటం గమనార్హం. రెండునెలలుగా గృహ నిర్భందంలో ఉన్న గిలానీని కలుసుకునేందుకు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి.. సీపీఐ నాయుడు డి. రాజా.. జేడీయూ నేత శరద్ యాదవ్.. ఆర్జేడీ నేత జయప్రకాశ్ నారాయణ్ లు వెళ్లారు. ఆయన ఇంటి గుమ్మం వద్దకు వెళ్లిన అఖిలపక్షం నేతలు దేశ వ్యతిరేక నినాదాలు వినాల్సి వచ్చింది.

ఇక.. కిటీకీలో నుంచి అఖిలపక్ష నేతల్ని చూసిన గిలానీ.. వారిని కలుసుకోవటానికి ఏ మాత్రం ఇష్టపడకపోగా.. వెళ్లిపోవాలంటూ చేతలు ఊపటం గమనార్హేం. ఇలాంటి అనుభవమే మిగిలిన అఖిలపక్ష నేతల బృందాలకు ఎదురైంది.జేకేఎల్ ఎఫ్ అధినేత యాసిన్ మాలిక్ వద్దకు వెళ్లిన బృందాన్ని కలిసేందుకు యాసిన్ మాలిక్ ఇష్టపడలేదు. తాను ఢిల్లీకి వచ్చినప్పుడు మాట్లాడతానని చెప్పిన.. వారిని కలవటానికి నో చెప్పేశారు. హురియత్ మాజీ ఛైర్మన్అబ్దుల్ ఘనీ భాట్ కూడా అఖిలపక్షానికి నల్లజెండా చూపించారు. ఇంటికి వచ్చిన ఎంపీలను సాదరంగా ఆహ్వానించారు కానీ మాట్లాడేది లేదని తేల్చేశారు. ఇక.. జైల్లో ఉన్న మితవాద నాయకుడు మీర్వాయిజ్ మాత్రం మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీని రెండు నిమిషాలు కలిసి.. యోగక్షేమాలు తెలుసుకొని పంపించేశారు. అయితే.. మీర్వాయిజ్ తో మీటింగ్ కోసం వెళ్లిన సీతారం ఏచూరి.. శరద్ యాదవ్ బృందాన్ని కలుసుకోవటానికి ఆయన ఇష్టపడలేదు. ఇలా.. హురియత్ నేతలతో చర్చలు జరపటం ద్వారా కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు అఖిలపక్షం చేసిన ప్రయత్నాలు ఏ మాత్రం సఫలం కాకపోవటమే కాదు చేదు అనుభవాలు ఎదురయ్యాయి.