Begin typing your search above and press return to search.

ఇదేంటి..జనతా కర్ఫ్యూ సక్సెస్ ర్యాలీనా..వీళ్లని ఏంచేయాలి?

By:  Tupaki Desk   |   23 March 2020 11:30 AM GMT
ఇదేంటి..జనతా కర్ఫ్యూ సక్సెస్ ర్యాలీనా..వీళ్లని ఏంచేయాలి?
X
కరోనా వైరస్ ..దేశంలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆదివారం ప్రధాని మోడీ పిలుపు మేరకు దేశం మొత్తం జనతా కర్ఫ్యూ కి పూర్తి మద్దతు ప్రకటించారు. అసలు ఈ జనతా కర్ఫ్యూ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే .. జన సమూహాల్ని నివారించడం. ప్రజలు బయట ఎక్కువగా తిరిగితే కరోనా వైరస్ ఉన్న వారి నుండి వేరే వాళ్లకు వ్యాధి సోకుతుందని - వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని - కాబట్టి ఎవరి ఇళ్లలో వాళ్లు ఉంటే వైరస్ చైన్ బ్రేక్ అవుతుందని - దీని ద్వారా కరోనా ప్రభావం కొద్దిగైనా తగ్గుతుందని ఈ జనతా కర్ఫ్యూకి ప్రధాని మోడీ పిలునిచ్చారు.

అయితే , ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు - కరోనా వైరస్ పై ఉన్న భయంతో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా జనాలు చాలా క్రమశిక్షణతో కర్ఫ్యూలో పాల్గొన్నారు. దేశ ప్రజానీకం మొత్తం ఇళ్లకే పరిమితం కావడంతో రోడ్లన్నీ బోసిపోయాయి. దుకాణాలన్నీ మూతపడి జన సంచారమే లేదు. మొత్తంగా కర్ఫ్యూ సూపర్ సక్సెస్ అయినట్లే కనిపించింది. దీని వల్ల కరోనాకు చాలా వరకు బ్రేక్ పడి ఉంటుందని అంచనా వేశారు. అయితే , ఉదయం నుండి సాయంత్రం 5 వరకు ఎంతో అప్రమత్తంగా ఉన్న జనాలు.. సాయంత్రం వేల అదుపు తప్పారు.

ఇదేదో ఒక రోజుతోనే కరోనా నుండి బయటపడిపోయినట్టు .. విచక్షణ మరిచి రోడ్ల మీదికి వచ్చారు. సాయంత్రం 5 గంటలకు తమ ఇళ్ల నుంచి బయటికి వచ్చి కాంపౌండ్ లోనో.. వరండాల్లోనో.. బాల్కనీల్లోనో నిలబడి మన కోసం కష్టపడుతున్న వైద్యులు - కార్మికులు - ఇతర సిబ్బందిని అభినందిస్తూ చప్పట్లు కొట్టమని ప్రధాని పిలుపునిస్తే.. దీన్నో వేడుకలా మార్చడానికి ప్రయత్నించారు కొందరు మహానుభావులు. ప్రధాని పిలుపు మేరకు ..సాయంత్రం 5 గంటలకి నార్త్ ఇండియాలో పలు చోట్ల వందల మంది జనాలు బయటికి వచ్చి రోడ్ల మీద ర్యాలీలు నిర్వహించారు. అందరూ ఒకరినొకరు రాసుకుంటూ జై భారత్ నినాదాలు చేశారు. జెండాలు పట్టుకుని ఊరేగింపులు నిర్వహించారు.

అసలు ప్రధాని మోడీ చెప్పిన జనతా కర్ఫ్యూ కి అసలు మీకు నిర్వచనం ఏంటో తెలుసా అంటూ నెటిజన్స్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ర్యాలీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎదో సాధించేసినట్టు ఇలా ర్యాలీలు చేయడం వల్ల ఉదయం నుంచి పాటించిన క్రమశిక్షణ అంతా వృథా అయింది అని, జనాలు ఇలా గుమికూడరాదనే కర్ఫ్యూ విధిస్తే.. ఈ కర్ఫ్యూ సక్సెస్ అయిందని ర్యాలీలు నిర్వహిస్తే వాళ్లను ఏం చేయాలి? అని ప్రశ్నిస్తున్నారు. అలాగే కొందరు సెలబ్రెటీలు - రాజకీయ ప్రముఖులు సైతం పదుల సంఖ్యలో ఒక చోట నిలబడి - జాతి ఐక్యతని చాటి చెప్పేలా చప్పట్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది కూడా జనాలకు తప్పుడు సంకేతాలే ఇచ్చింది. ప్రజలు ఒకే చోట చేరకూడదు అని జనతా కర్ఫ్యూ పాటించండి అని చెప్తే ... దాన్నే బ్రేక్ చేసి అందరూ ఒకేచోట చేరడం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.